నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు.. | - | Sakshi
Sakshi News home page

నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు..

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

తేల్చి చెప్పిన ఊడిమూడిలంక వంతెన కాంట్రాక్టర్‌

పి.గన్నవరం: మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై రూ.71.43 కోట్లతో చేపట్టిన వంతెన పనులకు సంబంధించి రూ.14 కోట్ల మేర పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే, పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం వంతెన పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతీ రాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ శివకుమార్‌కు అసోసియేట్‌ ఇంజినీర్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (కాంట్రాక్టర్‌) పీఎస్‌ రాజు తేల్చిచెప్పారు. గతంలో రూ.22 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన రూ.14 కోట్లు విడుదల చేయకపోవడంతో అతి ముఖ్యమైన వేసవి కాలాన్ని వినియోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధుల విడుదలకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే లంకలో అబెక్ట్‌మెంట్‌ వాల్‌ నిర్మాణం కోసం 14 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని సమకూర్చాలని కోరారు. మొత్తం 9 పిల్లర్లు, రెండు అబెక్ట్‌మెంట్‌ వాల్‌లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఇంత వరకూ 50 శాతం పనులు పూర్తి అయ్యాయని పీఆర్‌ డీఈఈ అన్యం రాంబాబు సీఈకి వివరించారు. వంతెన పూర్తయితే ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కష్టాలు తొలగుతాయని ఆయన తెలిపారు. పనుల ప్రగతిని ఆయన ఎస్‌ఈకి వివరించారు. వంతెన నిర్మాణాన్ని సీఈ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ పి.రామకృష్ణం రాజు, జేఈ సంపన్న దుర్గా కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement