శాంతిభద్రతల విధుల్లో..
ఫ చంటి బిడ్డతో
ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్
ఫ అభినందించిన స్థానికులు
సామర్లకోట: స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తరువాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలు దేరారు. అయితే కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులకు సంబంధించిన బ్యాగ్‌తో విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడారు.


