రావులపాలెం: దసరాకు ప్రత్యేక మైసూర్ యాత్ర ఏర్పాటు చేసినట్టు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎనిమిది రోజుల టూర్‌గా ఈ యాత్రను రూపొందించామన్నారు. సెప్టెంబర్ 24న బయలుదేరి మంత్రాలయం, హంపి, గోకర్ణం, మురుడేశ్వర్, మూకాంబిక, ఉడిపి, శృంగేరి, హార్నాడు, ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్యం, శ్రీరంగపట్నం, మైసూర్ అరుణాచలం మీదుగా అక్టోబర్ ఒకటో తేదీన తిరిగి రావులపాలెం చేరుతుందన్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు ఈ యాత్రకు ఒక టిక్కెట్ ధర రూ.8500 నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు అడ్వాన్స్ టికెట్లు, ఇతర వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయంలో 73829 11871 నంబరులో సంప్రదించాలన్నారు.
బాలాజీ హుండీ ఆదాయం రూ.38.2 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.38,20,531 ఆదాయం వచ్చింది. 71 రోజులకు హుండీలను లెక్కించారు. హుండీల్లో 30.200 గ్రాముల బంగారం, 105.600 గ్రాముల వెండిని కానుకలుగా సమర్పించారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఓ ఎంకేటీవీఎన్ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ ఈఓ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. నాలుగు యూఎస్‌ఏ డాలర్లు, 10 సౌదీ ఆరేబియా రియాల్స్, 5 యూఏఈ దినార్స్, 5 ఒమన్ రియల్స్, 23 కువైట్ దినార్స్, 5 ఇరాక్ దినార్స్‌ను భక్తులు హుండీల్లో సమర్పించారు. ఆలయ ఉద్యోగులు, సేవకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు పాల్గొన్నారు.