కోకో హబ్‌గా జిల్లా
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగుకు ఎంతో అనువైన వాతావరణం ఉందని, ఆ దిశగా కోకో సాగు విస్తీర్ణాన్ని దశల వారీగా పెంచుతూ కోకో హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కోకో కమిటీ ఆధ్వర్యంలో ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కోకో కాయల కోత అనంతరం ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో ఏక పంటగా కొబ్బరి విరాజిల్లేదని, ఫీడ్ నల్లి తాకిడితో కొబ్బరి దిగుబడి తగ్గిపోయి కేవలం కొబ్బరిపై ఆధారపడి రైతు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి తరుణంలో రైతును అన్ని విధాలుగా ఆదుకున్నది కోకో పంటని అన్నారు. కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయడానికి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి వస్తుందని అన్నారు. కాయల నుంచి తీసిన గింజలను నాణ్యతతో ప్రాసెస్ చేయడంలో రైతులకు అవగాహన లేక గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వెయ్యి ఎకరాలకు ఒక కామన్ పర్మింటేషన్ కేంద్రాన్ని ఒక ఎకరం స్థలంలో నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 2,500 ఎకరాలలో కోకో పంట ఉందని దీనిని దశలవారీగా ఏడాదికి వెయ్యి ఎకరాలు చొప్పున విస్తీర్ణాన్ని పెం చేందుకు కార్యాచరణ అమలు కాబోతోందన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత, శాస్త్రవేత్త నవీన్ కుమార్ జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, రమ్య ఫుడ్స్ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, ఉద్యాన అధికారులు దిలీప్, చందన పాల్గొన్నారు.
తహసీల్దార్లకు నైపుణ్య పరీక్షలు
జిల్లాలోని తహసీల్దార్లు ఆన్‌లైన్ సేవలను స్వయంగా నిర్వహించగలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని అంచనా వేసేందుకు నైపుణ్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని తహసీల్దార్లకు మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో జాయింట్ కలెక్టర్, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం నైపుణ్య పరీక్షలు షిఫ్టుల వారీగా చేపట్టామన్నారు.


