యువతిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ

Two accused arrested in attack of women viral video incident - Sakshi

3 నెలల కిందటి ఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌

వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్‌ 

మీడియాకు వివరాలు వెల్లడించిన నెల్లూరు జిల్లా ఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): తనను దూరంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఓ యువతిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. పైగా ఆ వ్యవహారాన్ని స్నేహితుడి ద్వారా వీడియో తీయించాడు. ఆ వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు బుధవారం మీడియాకు వెల్లడించారు. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్‌ స్నేహితులు. వెంకటేష్‌ టిప్పర్‌ డ్రైవర్‌. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు. సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్‌ ద్వారా వీడియో తీయించి పైశాచికానందం పొందాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్‌ 
మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్‌ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్‌ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజుల్లోపు చార్జ్‌షీటు వేసి శిక్షపడేలా చేస్తామని చెప్పారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌చేసిన నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తదితరులను ఎస్పీ విజయారావు అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top