
కన్నపిల్లల కళ్ల ముందే తల్లి దుర్మరణం
కదులుతున్న రైలు ఎక్కబోతుండగా ప్రమాదం
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఘటన
సికింద్రాబాద్: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది.
ఇందుకోసం భర్త వెంకటేశ్ ఆన్‌లైన్ టికెట్ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్ తీసుకువచ్చిన వెంకటేశ్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్ నంబర్ సరిగా ప్రింట్ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్‌ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది.

రైలు బోగీ, ప్లాట్‌ఫాం మధ్య నలిగి..
పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్‌లైన్ టికెట్‌లో ప్రింట్ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.