వరంగల్‌లో తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి

Three Drowned Dead Belongs To One Family At Narsampet Warangal District - Sakshi

సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది.

అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్‌ (11), కార్తీక్‌ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్‌ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు.

దీపక్‌ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి 
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top