బీమా డబ్బుల కోసం డ్రామా 

Telangana: Secretariat Employee Fake Death Killed Driver For Insurance - Sakshi

కారు దహనం కేసులో అనూహ్య మలుపు 

డ్రైవర్‌ను చంపి.. కారులో సజీవ దహనం చేసి.. తాను ప్రమాదంలో చనిపోయినట్లు ధర్మా స్కెచ్‌ 

భార్య ఫోన్‌కు పంపిన మెసేజ్‌ ఆధారంగా విచారణ 

మహారాష్ట్రలోని పుణెలో ధర్మా అరెస్టు 

మెదక్‌జోన్‌: కారుతోసహా వ్యక్తి సజీవదహనమైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం నాటకం ఆడి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వివరాలు.. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లా తండాకు చెందిన ధర్మానాయక్‌ సెక్రెటేరియేట్‌లోని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఈ నెల 5న స్వగ్రామానికి వచ్చా డు. 6న మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. 7న రాత్రి ఇంటికొస్తున్నానని భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. 8వ తేదీ రాత్రి వెంకటాపూర్‌ గ్రామ శివారులో ధర్మా కారుతో సహా కాలిపోయాడనే సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కనే ఖాళీ పెట్రోల్‌ బాటిల్‌ గుర్తించారు. దీంతో ధర్మా ప్రమాదంలో చనిపోయాడా? ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

మెస్సేజ్‌ ఆధారంగా గుర్తింపు.. 
విచారణ ప్రారంభించిన పోలీసులు ధర్మా భార్య నీల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధర్మా పుణెకు వెళ్లి తన భార్య ఫోన్‌కు తన డెత్‌ సర్టి ఫికెట్‌ తీసి ఇన్సూరెన్స్‌ డబ్బులకు దరఖాస్తు చేయాలని మెస్సేజ్‌ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పుణెలో ధర్మాను అరెస్ట్‌చేశారు.

భార్యభర్తలిద్దరూ కలిసే ఈ స్కెచ్‌ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్‌ చేశాడు. ధర్మా 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపి, ఆపై కారులో మృతదేహాన్ని ఉంచి పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ధర్మాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది.  

బెట్టింగ్‌లు ఆడి... 
ధర్మా కొంతకాలంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్‌ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్‌ఐసీ పాలసీల క్లెయిమ్‌ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్‌ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top