తిరుచ్చిలో ఎన్‌ఐఏ దూకుడు | Sakshi
Sakshi News home page

తిరుచ్చిలో ఎన్‌ఐఏ దూకుడు

Published Wed, Jul 29 2020 6:34 AM

Tamil Nadu Agents Arrest in Kerala Gold Smuggling Case - Sakshi

సాక్షి, చెన్నై: కేరళ బంగారం స్మగ్లింగ్‌ విచారణ తిరుచ్చికి చేరింది. ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం తిరుచ్చిలో తిష్ట వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం యూఏఈ కాన్సులేట్‌కు బంగారంతో వచ్చిన పార్శిల్‌ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అక్కడి అధికారి స్వప్న సురేష్‌తో పాటు మరెందరో అరెస్టయ్యారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులను ఎన్‌ఐఏ వర్గాలు విచారణ చేశాయి. ఈ కేసు ప్రస్తుతం తమిళనాడు వైపుగా మరలడం చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎన్‌ఐఏ వర్గాల దృష్టి తిరుచ్చిపై పడింది. ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌లో ఏజెంట్లుగా వ్యవహరించిన వారందరూ తిరుచ్చికి చెందిన వారుగా ఎన్‌ఐఏ గుర్తించింది.

దీంతో ఇక్కడి పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్‌ఐఏ వర్గాలు ఉదయాన్నే దూకుడు పెంచాయి. తిరుచ్చిలోని అండగుండం, జాఫర్‌ ఖాన్‌ వీధుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అక్బర్‌ అలీ అనే వ్యక్తిని ప్రత్యేక ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. వీరంతా ముంబై, కోల్‌కతాలకు బంగారం స్మగ్లింగ్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు తిరుచ్చిలోని ఓ ప్రముఖ నగల వ్యాపారికి సైతం సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిని ఆగమేఘాలపై తిరువనంతపురానికి తరలించారు. ఇక ఇటీవల కాలంగా తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ బంగారంతో ఈ కేసుకు సంబంధాలు ఉండవచ్చన్న కోణంలోనూ ఎన్‌ఐఏ విచారణ వేగం పెరిగింది. 

Advertisement
Advertisement