చెన్నై పోర్టుకు తరలిస్తుండగా.. | Sakshi
Sakshi News home page

చెన్నై పోర్టుకు తరలిస్తుండగా..

Published Tue, Aug 18 2020 1:01 PM

Ration Rice Smuggling Gang Arrest in SPSR Nellore - Sakshi

కావలి: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని కావలి వద్ద విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మూడు లారీల్లో తమిళనాడులోని చెన్నై పోర్టుకు తరలిస్తున్న రేషన్‌ బియ్యం 70 టన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. విజిలెన్స్‌ సీఐ పీవీ నారాయణ, పౌరసరఫరాల శాఖ కావలి అధికారి ఐ.పుల్లయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పొన్నూరు, కర్లపాళెం నుంచి రెండు లారీలు 55 టన్నుల రేషన్‌ బియ్యంతో చెన్నైకు బయలుదేరాయి. అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి 15 టన్నులతో మరో లారీ చెన్నై దారి పట్టింది.

తనిఖీలు చేస్తుండగా..
కావలి వద్ద చెన్నై – కోల్‌కత్తా జాతీయ రహదారిపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న 3 లారీలను వారు తనిఖీ చేసి అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. అధికారులను చూసిన కందుకూరుకు చెందిన లారీ డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన రెండు లారీల డ్రైవర్లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన లారీలను కావలిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు చేర్చి, బియ్యం బస్తాలను దించారు. ఖాళీ లారీలను కావలి రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

కందుకూరుకు చెందిన లారీ వద్ద పోలీసులను ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రేషన్‌ బియ్యం విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.  కాగా కందుకూరుకు చెందిన లారీలోని రేషన్‌ బియ్యాన్ని కూడా పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలిస్తామని అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ కె.వెంకటరామిరెడ్డి, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ గోపాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement