అత్యాచార యత్నం.. ఆపై నిప్పంటించి..

Pour Kerosene On Divyanguralu And Set It On Fire In Mahaboobnagar District - Sakshi

దివ్యాంగురాలిపై దారుణం.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

మద్దూరు: ఓ దివ్యాంగురాలికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఆ యువతి ప్రతిఘటించడంతో నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన దివ్యాంగురాలైన కృష్ణవేణి(21) కొన్నాళ్లుగా తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన తమ్ముడుతో కలసి హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లిలో ఉంటోంది.

తల్లిదండ్రులు వెంకటమ్మ, గోవిందు దినసరి కూలీలు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం వింజమూర్‌వాసి వెంకట్‌రాములు హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకునేవాడు. భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణవేణి తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈనెల 8న వెంకట్‌రాములు మాయమాటలు చెప్పి కృష్ణవేణిని తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు రాజేంద్రనగర్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కోస్గి పట్టణంలో గ్రామస్తులకు కనిపించడంతో హైదరాబాద్‌కు వెళ్తున్నామంటూ నమ్మించి మద్దూరుకు తీసుకొచ్చాడు. అదేరోజు సాయంత్రం గురుకుల పాఠశాల వెనకాల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

బాధితురాలు ప్రతిఘటించడంతో చీరకు నిప్పంటించి పారిపోయాడు. మంటలు గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందింది. కాగా,   బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ యాదవ, వికలాంగ సంఘాల ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా నిర్వహించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top