Malla Reddy Murder Case: పక్కా ప్లాన్‌తో న్యాయవాది మల్లారెడ్డి హత్య.. హంతక ముఠాకు రూ.15 లక్షలకుపైగా సుపారీ?

Police Collect Evidence For Advocate Malla Reddy Murder Case - Sakshi

మల్లారెడ్డి మర్డర్‌ కేసు మిస్టరీ వీడినట్లే.. 

‘సుపారీ’రూ.15 లక్షలపైనే.. 

హంతక ముఠా కర్నూలు జిల్లా బ్యాచ్‌ 

హత్యకు సూత్రధారి నర్సంపేట వ్యాపారి? 

పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు 

అదుపులో సూత్రధారులు, పాత్రధారులు? 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లే. ములుగు జిల్లా పందికుంట సమీపంలో ఆయన దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ములుగు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

రెండు రోజులపాటు మల్లంపల్లి మాజీ సర్పంచ్‌ పిండి రవి, మైనింగ్‌ వ్యాపారంతో సంబంధమున్న కె.వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు ఎర్రమట్టి క్వారీల యజమానులను విచారించారు. 44 క్వారీలకు చెందిన సుమారు 24 మందిని విచారించిన పోలీసులు బుధవారం కీలక ఆధారాలు రాబట్టి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య కేసు మిస్టరీ వీడినట్లు సమాచారం.

హత్యకు ప్రధాన సూత్రధారి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఓ రైస్‌ మిల్లు వ్యాపారిగా పోలీసులు అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య పూర్తి వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఆయన చెప్పిన వివరాల మేరకు మైనింగ్‌ క్వారీల నిర్వహణ, మల్లారెడ్డితో దీర్ఘకాలిక వివాదమున్న కీలక వ్యక్తులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హత్య కేసుతో సంబంధమున్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  15 మందికిపైగా అనుమానితులను ప్రశ్నించిన తర్వాత హత్యకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 

రూ.15 లక్షలకుపైగా సుపారీ?  
మైనింగ్‌ వివాదమే మల్లారెడ్డి హత్యకు కారణమన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలి సింది. హత్యకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సుపారీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. హత్యకు పథకం తర్వాత నర్సంపేట, శాయంపేటకు చెందిన 2 సుపారీ గ్యాంగ్‌లతో మాట్లాడినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతానికి చెందిన నలుగురు హంతక ముఠా సుపారీ తీసుకుని మల్లారెడ్డిని హత్య చేసినట్లు సమాచారం.

వీరితో పాటు నల్లగొండకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top