అప్పుల కుప్పపై చి‘వరి’ శ్వాస | Sakshi
Sakshi News home page

ధాన్యం అమ్ముడుగాక వరి కుప్ప వద్ద రైతు ఆత్మహత్య

Published Thu, Dec 2 2021 4:45 AM

Paddy Farmer Suicide In Eturu Nagaram - Sakshi

ఏటూరునాగారం: ధాన్యం కొనుగోళ్లలో కొనసాగుతున్న తీవ్ర జాప్యం ఓ అన్నదాతను బలిగొంది. కోసిన కొంత పంట అమ్ముడు కాక.. మిగిలిన పంట కోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల భారం భరించలేక ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురంలో చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బెతెల్లి కుమార్‌ (43) రైతు తనకున్న రెండెకరాల సొంత భూమితోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అందులో 6 ఎకరాల వరి పంట కోయించాడు. శివాపురంలో ధాన్యం కేంద్రం ప్రారంభమైనా అధికారులు కొనుగోళ్లు మొదలు పెట్టలేదు. తేమశాతం తగ్గేందుకు 6 ఎకరాల ధాన్యాన్ని ఇంటి పెరడులో ఆరబోశాడు.

ఉదయం ఆరబోయడం, రాత్రి కుప్పపోయడం చేస్తున్నాడు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తే తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో రెండు ఎకరాల వరి కోతకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. గత ఏడాది అప్పు రూ.3లక్షల భారం నెత్తిమీద ఉంది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు వరినేలబారిగా దిగుబడి తగ్గింది. ఇటు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేక.. మిగతా వరిని కోసేందుకు డబ్బులు లేకపోవడం.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొన్నిరోజులు దిగులుగా ఉన్నాడు.

మంగళవారం రాత్రి పెరడులో ఉన్న ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం, అక్కడినుంచి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement