బీమా సొమ్ము కోసం మర్డర్‌ ప్లాన్‌: కేసులో పురోగతి.. చనిపోయిన వ్యక్తి వివరాలివే..

Nizamabad: Police Progress In Murder Case Of One For Insurance Money - Sakshi

ఖలీల్‌వాడి (నిజామాబాద్‌): రూ. లక్షల్లో ఉన్న అప్పులను బీమా సొమ్ముతో తీర్చేందుకు ఓ ప్రభుత్వోద్యోగి తన లాంటి వ్యక్తిని హత్య చేసి కారు సహా మృతదేహాన్ని దహనం చేసిన కేసులో మృతుడు బాబు స్వస్థలాన్ని పోలీసులు గుర్తించారు. బాబు మారోతి గలగాయే (42) మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బోకర్‌ తాలుకా లాగలూద్‌ గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ధర్మానాయక్, అతని మేనల్లుడు తేజవత్‌ శ్రీనివాస్‌ కలిసి నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి అడ్డా కూలీ అయిన బాబును గత వారం మెదక్‌ జిల్లా టెక్మాల్‌ మండలంలోని వెంకటాపూర్‌ చెరువు వద్దకు కారులో తీసుకెళ్లి హతమార్చడం... ఆపై కారుతోపాటు మృతదేహంపై పెట్రోల్‌ పోసి దహనం చేయడం తెలిసిందే.

ఈ కేసులో బాబు కనిపించట్లేదంటూ నిజామాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్‌లలో ఎటువంటి మిస్సింగ్‌ కేసు నమోదు కాకపోవడంతో అతని స్థానికతను కనుగొనేందుకు పోలీసులు వివిధ రైల్వేస్టేషన్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బోకర్‌ రెల్వేస్టేషన్‌లో బాబు రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఆరా తీశారు.

కూలి పనుల కోసం నిజామాబాద్‌లో అతను రైలు దిగినట్లు మృతుని కుటుంబ సభ్యులను విచారించి తెలుసుకున్నారు. మరోవైపు బాబుకన్నా ముందు ధర్మానాయక్‌ చంపాలనుకున్న నాంపల్లికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఎందుకు, ఎలా తప్పించుకొని పారిపోయాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అంజయ్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను తీసుకువెళ్లినట్లు సమాచారం. అతన్ని మెదక్‌ పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top