మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌

Most Wanted Criminal Sandlewood Smuggler Arrest YSR Kadapa - Sakshi

పోలీసుల అదుపులో మరో 10 మంది.. 

16 ఎర్రచందనం దుంగలు, 

4 వాహనాలు స్వాధీనం  

కడప అర్బన్‌ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర నేరాలకు పాల్పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనితోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కడప అర్బన్‌ సీఐ కార్యాలయ ఆవరణలో సీఐ ఎస్‌ఎం అలీ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ, అర్బన్‌ సీఐ ఎస్‌ఎం అలీ, చెన్నూరు ఎస్‌ఐ పెద్ద ఓబన్న జిల్లా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చెన్నూరు మండలంలోని కొండపేట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న షేక్‌ సింపతి జాకీర్‌ అలియాస్‌ సింపతి లాల్‌బాషాతోపాటు మరో పది మందిని అరెస్ట్‌ చేశారు.

అరెస్టు అయిన వారిలో చాపాడు మండలానికి చెందిన చిన్న దండ్లూరు మహమ్మద్‌ నాసీర్, జి.రజాక్‌వల్లీ, రైల్వేకోడూరు మస్తాన్, సీకే దిన్నె మండలానికి చెందిన నాగదాసరి మహేష్, తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వాసులు తంగవేలు, కనకరాజ్, «సుబ్రమణి, ధర్మపురి జిల్లాకు చెందిన వెంకట్రామన్, లక్ష్మణ్, రఘు ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన షేక్‌ సింపతి జాకీర్‌ గతంలో ఆటో నడిపే వాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాల కు పాల్పడే వాడు. క్రమేణా అంతర్జాతీయ స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. ఇతనిపై జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో దాదాపు 60 కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 31 లక్షలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్‌బీ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఏఆర్‌ ఎస్‌ఐ మురళి, హెడ్‌కానిస్టేబుళ్లు శివ, సాగర్, రాజేష్, రమణ, కొండయ్య, గోపి నాయక్, స్పెషల్‌ పార్టీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top