
వరంగల్ : భార్యను భయబ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని అబ్బని కుంటకు చెందిన వనజ హరికృష్ణ భార్యాభర్తలు. నిత్యం హరికృష్ణ మద్యం సేవించి భార్య వనజను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హరికృష్ణ పెట్టే ఇబ్బందులతో మనస్తాపానికి గురై వనజ, హరికృష్ణ నుండి తనను కాపాడాలంటూ మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. కేసు విషయమై పోలీస్ స్టేషన్ రావాలని ఫోన్ చేయడంతో హరికృష్ణ ఆందోళనకు గురయ్యాడు.
భార్య, పోలీసులను బెదిరించాలని అనే ఉద్దేశంతో ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో పెట్రోల్ క్యాన్ పెట్టుకొని స్టేషన్ ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పి పోలీసు వాహనంలో చికిత్సకోసం హరికృష్ణ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో హరికృష్ణ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.