పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య.. తులసిచెట్టుకు పూజ

Man Assassinated Two persons in Nizamabad Over Land Issue - Sakshi

సాక్షి, మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడో యువకుడు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్‌ గ్రామానికి చెందిన కర్రోళ్ల పెద్దబ్బయ్య (64), కర్రోళ్ల నడిపి సాయిలు (54) అన్నదమ్ముళ్లు. పెద్దబ్బయ్య ముగ్గురు కొడుకులు బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లారు.

రెండో కొడుకైన సతీష్‌ ప్రవర్తనలో తేడా రావడంతో.. కంపెనీ ప్రతినిధులు నాలుగేళ్ల క్రితం స్వగ్రామానికి పంపించారు. ఇక్కడ తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అప్పటినుంచి పనీపాటా లేకుండా తిరుగుతూ, తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇటీవల తానే పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్పాడు.

చదవండి: (జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’) 

ఆడపెళ్లివారు ఆగస్ట్‌ 14న ఇంటికి వస్తారని గురువారం రాత్రి చెప్పాడు. గల్ఫ్‌లో ఉన్న అన్నదమ్ములతో మాట్లాడిన తర్వాత రమ్మని చెబుదామని కొడుకుని తండ్రి వారించాడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్నాన సాయిలు వచ్చి సతీష్‌కు నచ్చజెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటలకు  మళ్లీ గొడవ మొదలైంది. వెంటనే కోపోద్రిక్తుడైన సతీష్‌ ఆవరణలో పనిచేస్తున్న తండ్రిని కర్రతో కొట్టడానికి వెళ్లగా, నడిపి సాయిలు అడ్డుకున్నాడు. వెంటనే సతీష్‌ అక్కడే ఉన్న పారతో నడిపి సాయిలు తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు.

పెద్దబ్బయ్య అరుస్తూ తమ్ముడి వద్దకు రాగానే, తండ్రిని కూడా బలంగా మోదాడు. ఇద్దరి తలలపై పారతో మరోసారి బాది చనిపోయారని నిర్ధారణకు వచ్చాక నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నరహరి, ఎస్‌ఐ మహేష్, సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. 

హత్య తరువాత తులసిచెట్టుకు పూజ
తల్లి, వదినను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. తల్లి బయటికి పరుగెత్తి, వదిన ఇంట్లో గొళ్లెం పెట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారని స్థానికులు తెలిపారు. ఇద్దరిని హత్య చేసిన తర్వాత నిందితుడు తులసి చెట్టు చుట్టూ తిరిగి పూజలు చేశాడని వెల్లడించారు. పెద్దబ్బయ్య చితికి భార్య లక్ష్మీ, నడిపి సాయిలు చితికి కుమార్తె నిప్పంటించారు. సాయిలు కుమారుడు గల్ఫ్‌లో ఉండగా, భార్య మూడేళ్ల క్రితమే క్యాన్సర్‌తో మృతి చెందింది. 

చదవండి: (అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top