Nalgonda: Man Assassinated Sisters Mother In Law - Sakshi
Sakshi News home page

చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..

Dec 23 2021 9:10 AM | Updated on Dec 23 2021 10:13 AM

Man Assassinated Sisters Mother In Law Nalgonda - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి,నిడమనూరు(వరంగల్‌): ఒకే గ్రామంలో ఉన్నా పుట్టింటికి వెళ్లకూడదని ఆంక్షలు.. వారితో పల్లెత్తు మాట కూడా మాట్లాడొద్దని ఆదేశాలు.. అనారోగ్యం బారిన పడినా కనీసం చికిత్స కూడా చేయించని కాఠిన్యం.. చీటికి మాటికి వేధింపులు.. మానసిక చిత్రహింసలు.. ఇలా తన చెల్లెలిని అత్తింటి వారు బాధ పెడుతున్నారని ఆ యువకుడు రగిలిపోయాడు. ఇదే విషయంపై ఒకమారు బావను మందలించి దండించినా మార్పు రాలేదు. సరికదా అతడి ఆగడాలు పెచ్చరిల్లాయి. దీంతో సోదరి పడుతున్న బాధలు చూడలేక ఆ యువకుడు సోదరి అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాక్షన్‌ తరహాలో తెగబడి చెల్లెలు అత్తను దారుణంగా మట్టుబెట్టగా మరో ముగ్గురిపై కత్తులతో దాడి చేశారు. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్‌లో ఓ కుటుంబంపై జరిగిన దాడికి ఇవే కారణాలని తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..

భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా..
బొక్కమంతులపాడ్‌ గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ(60) దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోధ దంపతుల కూతురు శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివనారాయణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఐటీ రంగం దెబ్బతినడంతో రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కూతురు సంతానం.కాగా, శివనారాయణ తనకు భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా శ్యామలను వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విడాకుల కోసం కోర్టుకు సైతం వెళ్లారని సమాచారం. దీంతో రెండు కుటుంబాల పెద్ద మనుషులు దంపతులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చారని తెలిసింది.

మార్చురీలోనే అచ్చమ్మ మృతదేహం 
వియ్యంకుడి కుటుంబం దాడిలో దారుణ హత్యకు గురైన కమతం అచ్చమ్మ మృతదేహం ఇంకా మిర్యాలగూడ మార్చురీలోనే ఉంది. భిక్షమయ్య, అచ్చమ్మ దంపతులకు కుమారుడు శివనారాయణ, కూతురు జ్యోతి సంతానం. కాగా, దాడిలో గాయపడిన కుమారుడు, భర్త ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా కూతురు జ్యోతి విదేశంలో స్థిరపడింది. అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. విదేశంలో ఉన్న ఆమె కూతురు వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

నీ కూతురును కొట్టలేదు.. కొడితే ఏం చేస్తావ్‌..?
పెద్ద మనుషులు సర్దిచెప్పినా శివనారాయణ తీరులో మార్పు రాలేదు. పైగా పుట్టింటికి వెళ్లొద్దని, వారితో మాట్లాడొద్దని ఇలా పలు రకాల ఆంక్షలు పెట్టి శ్యామలను వేధిస్తున్నాడు. ఇదే తరుణంలో గత సోమవారం శ్యామలతో గొడవ పడిన విషయం సూర్యనారాయణకు తెలియడంతో తన అల్లుడు కూతురిని చిత్రహింసలు పెడుతున్నాడని గ్రామస్తుల వద్ద వాపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శివనారాయణ మామ సూర్యనారాయణకు ఫోన్‌ చేసి నీ కూతురును కొట్టలేదు.. ఇప్పుడు కొడితే ఏం చేస్తావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం సూర్యానారాయణ తన కొడుకు శివకు చెప్పడంతో అగ్గికి ఆజ్యం పోసిన చందంగా ఫ్యాక్షన్‌ తరహా దాడికి కారణమైందని తెలుస్తోంది.

ఈ దాడిలో కుమారుడికి సహకారం అందిస్తున్నారన్న అభియోగం మేరకు వృద్ధురాలు అచ్చమ్మ ప్రాణాలు కోల్పోగా శివనారాయణ, అతడి తండ్రి భిక్షమయ్య, అచ్చమ్మ తల్లి నారాయణమ్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో గ్రామస్తులు ఘటన స్థలానికి రావడంతోనే శ్యామల అత్తింటి వారిని అందరినీ మట్టుబెట్టలేక నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. దాడి ఘటన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. విచారణలో దాడికి ఇవే కారణాలంటూ నిందితులు ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, నిందితుల లొంగుబాటుపై నిడమనూరు పోలీసు లను వివరణ కోరగా «ధ్రువీకరించలేదు. కాగా, దాడిలో గాయపడిన శివనారాయణను మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం హైదరాబాద్‌కు తరలించగా మిగిలిన ఇద్దరు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement