విషాదం: స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లలో అపశ్రుతి

Madhya Pradesh: Three Lives Ends In Installing National Flag - Sakshi

భోపాల్‌ (మధ్యప్రదేశ్‌): దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సంబరాలు రేపు అంబరాన్నంటనున్నాయి. రేపటి ఉత్సవాల కోసం శనివారం ఏర్పాట్లు శరవవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్‌ సిబ్బంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చారిత్రక నేపథ్యం ఉన్న మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్‌) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్‌ ఫైర్‌ బ్రిగేడ్‌ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి ఆ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరిదీ నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

జాతీయ పండుగ ఏర్పాట్లలో విషాదం అలుముకోవడంపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తులసీరామ్‌ సిలావత్‌ ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top