యూపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

High Court Expresses serious No Action Against Hathras Top Official - Sakshi

లక్నో: హత్రాస్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వైఖరిపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ కూమార్‌ పై యూపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ కేసుపై సోమవారం అలహాబాద్‌ హైకోర్టు ​విచారణ చేపట్టింది. హత్రాస్‌ దారుణోతందంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్ రాజన్‌ రాయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. తదుపరి విచారణలోపు (నవంబర్‌ 25) జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది.

కాగా, హత్రాస్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి దహనం చేయడంతో జిల్లా మేజిస్ట్రేట్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని కోర్టు ప్రశ్నించగా... ఆయన చర్యను ప్రభుత్వం సమర్థించింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీని ఇప్పటికే సస్పెండ్‌ చేసినట్టు ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం, మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ కూమార్‌, సస్పెండ్‌ అయిన ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తమకు తెలపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 

అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న కన్నుమూసింది. దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top