డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలు సేకరించి.. | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలు సేకరించి..

Published Wed, Aug 30 2023 1:45 AM

Frauds made by silicon fingerprints - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిలికాన్‌ ఫింగర్‌ప్రింట్స్‌ (నకిలీ వేలిముద్రల)ను తయారు చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను తెలంగాణ సీఐడీ పోలీస్‌ బృందం అరెస్టు చేసింది.

ఈ ముఠాలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్‌షాను ఆ రాష్ట్రంలోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఈనెల 24న, మరో నిందితుడు సఫాత్‌ ఆలంను ఈనెల 14న బెంగళూరులో అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌భగవత్‌ మంగళవారంనాడిక్కడ తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు అక్మల్‌ ఆలంను సీఐడీ పోలీసులు గతేడాది డిసెంబర్‌లో బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

రిజిస్ట్రేషన్ ‌ డాక్యుమెంట్లలోని వేలిముద్రలతో...
ఈ సైబర్‌ మోసంలో నిందితులు రిజిస్ట్రేషన్ , రెవెన్యూశాఖల వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఈ ముఠా ముందుగా రిజిసే్ట్రషన్, రెవెన్యూ శాఖల వెబ్‌సైట్‌లోకి వెళ్లి సేల్‌డీడ్, ఇతర డాక్యుమెంట్లలో వేలిముద్రలను, ఆధార్‌ నంబర్లను, బ్యాంక్‌ ఖాతాల్లో పేర్లను సేకరిస్తుంది. ఈ వేలిముద్రలను ఆధారంగా సిలికాన్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తయారు చేస్తున్నారు.

కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్స్‌ (సీఎస్‌పీ)ల సిబ్బందితో కుమ్మక్కై ఆ సెంటర్లలో ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌) విధానంలో వేలిముద్రలను పెట్టి, ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసి సదరు వ్యక్తులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును డ్రా చేస్తున్నారు. ఆధార్‌ నంబర్, బ్యాంక్‌ ఖాతాలో పేరు, వేలిముద్ర ఉంటే ఏఈపీఎస్‌ల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశం ఉండటం సైబర్‌ నేరగాళ్లకు కలిసొచ్చే అంశంగా మారింది.  

ఇలా వెలుగులోకి వచ్చింది...  
హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరిస్‌ రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచీలో ఖాతా ఉన్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగి గతేడాది డిసెంబర్‌లో సీఐడీ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. గతేడాది డిసెంబర్‌ 4, 5 తేదీల్లో తన బ్యాంకు ఖాతా నుంచి నాలుగు విడతల్లో మొత్తం రూ.24 వేలు తనకు తెలియకుండానే ఎవరో డ్రా చేసినట్టు ఫిర్యాదు చేశారు.

దీనిపై దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు నగదు విత్‌డ్రా చేసిన ప్రాంతంలో బ్యాంకు ఖాతాలు, అక్కడ నిందితులు వాడిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది డిసెంబర్‌ 22న కీలక నిందితుడు అక్మల్‌ ఆలంను అరెస్టు చేశారు.

అతడి నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీఐడీ సైబర్‌క్రైం ఎస్పీ లావణ్య ఎన్‌జేపీ, మరో ఎస్పీ బి. రామ్‌రెడ్డిని మహేశ్‌భగవత్‌ అభినందించారు.  

Advertisement
 
Advertisement