పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!

Eight men gang arrested for cheating witchhunt in jugulamba gadwal inTS - Sakshi

మాయగాళ్లకు సంకెళ్లు     

అమాయక ప్రజలే టార్గెట్‌  

ఎనిమిది మంది ముఠా సభ్యుల అరెస్టు  

2 కార్లు, 9సెల్‌ఫోన్లు, రూ.25 వేలు స్వాదీనం   

గద్వాల : ప్రజల అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మంత్రాల పేరిట డబ్బు దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఈ ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.62.5 లక్షలను ఎత్తుకెళ్లారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఎనిమిది మంది మోసగాళ్లను గద్వాల జిల్లా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ ఈ ముఠా చేసిన మోసాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్‌ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్‌ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట జనాన్ని మభ్యపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.  

పూజల పేరిట నమ్మించి.. రూ.62 లక్షలకు టోకరా 
2019 అక్టోబర్‌లో ఈ ముఠా సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డిని కలసి మాయమాటలు చెప్పి ఇంట్లో నాగదేవత పేరిట పాముకు ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మించారు. అలాగే తమ వద్ద ఉన్న మహిమగల భస్మం, విభూతిని ఇంట్లో చల్లితే కష్టాలు పోయి పెద్ద ధనవంతులు అవుతారని, పూజలో డబ్బులు ఉంచితే పదింతలు అవుతాయని చెప్పారు. దీంతో బాధితుడు ఇంట్లో ఉన్న రూ.62.5 లక్షలను పూజలో ఉంచాడు. ముఠాసభ్యులు పూజ పేరిట కొద్దిసేపు హడావుడి చేసి పథకం ప్రకారం అప్పటికే మత్తు కలిపిన పౌడర్‌ను అతడిపై చల్లి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. డబ్బులు వస్తాయన్న భ్రమలో ఉన్న బాధితుడు రెండు రోజుల తర్వాత మంత్రగాళ్లు మోసం చేశారని గుర్తించి అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదే తరహాలో ఈ ముఠాసభ్యులు గత నెల 30వ తేదీన అయిజ మండలం తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్‌కు కూడా మాయమాటలు చెప్పారు. పూజలకోసం భస్మం, విభూతి డబ్బా కొనేందుకు రూ.10 లక్షలు కావాలని అడిగారు. అయితే అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.30 వేలు ముఠా సభ్యులకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున అయిజ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు, రెండు రాగి రింగులు, భస్మం, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. పామును అటవీ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ కేసుల దర్యాప్తులో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top