'లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..

Cyber Criminals CHeats IT Employee In Hyderabad - Sakshi

ఐటీ ఉద్యోగిని నమ్మించి మోసం 

యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకుని రూ. 9 లక్షల షేర్స్‌ స్వాహా 

ఆర్మీ అధికారినంటూ డీసీఎం డ్రైవర్‌ నుంచి రూ. 4.50 లక్షల లూటీ 

సాక్షి, హైదరాబాద్‌ (హిమాయత్‌నగర్‌): ట్రేడింగ్‌ వెబ్‌సైట్లో చూశాం, మీరు చాలా షేర్లు రాబట్టుకోగలిగారు. కానీ, దానిపై ఎక్కువ టైం పెట్టలేకపోతున్నారు. మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ మాకిస్తే మేమే ట్రేడింగ్‌ చేసి లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తామంటూ నగర యువతిని మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. వాట్సాప్‌ కాల్‌ ద్వారా నిమిషాల పాటు మాట్లాడి, ఒప్పించారు. ఇలా తన వద్ద ఉన్న పాస్‌వర్డ్, యూజర్‌ ఐడీ తీసుకుని తన షేర్లన్నీ వాళ్ల అకౌంట్‌లోకి మార్చుకుని మోసం చేశారంటూ ఐటీ ఉద్యోగి గురువారం సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. ఎస్‌ఐ ప్రశీన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేస్తున్న యువతికి ట్రేడింగ్‌ అంటే ఇష్టం.‘జెరోధా’ అనే వెబ్‌సైట్‌లో ఆమె కొంతకాలంగా ట్రేడింగ్‌ చేస్తూ.. రూ. 9 లక్షల షేర్లను సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని సైబర్‌ నేరగాళ్లు గుర్తించారు. లాగిన్‌ అయ్యి ఆమెకు చెందిన రూ. 9 లక్షల షేర్లను వారి అకౌంట్‌లలోకి మార్చుకుని మోసానికి పాల్పడ్డారు. 

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

►ఆర్మీ అధికారినంటూ డీసీఎం డ్రైవర్‌ను మోసం చేశాడో సైబర్‌ నేరగాడు. తాను ఇల్లు షిఫ్ట్‌ అవుతున్నాని నమ్మించి, డీసీఎం కావాలని కోరాడు. రూ. 30 వేలకు కిరాయి మాట్లాడుకున్నాడు. అయితే రూ. లక్ష అకౌంట్‌లో ఉంటేనే తమకు చెందిన డబ్బులు వస్తాయని డ్రైవర్‌ను నమ్మించాడు. దీంతో డ్రైవర్‌ రూ. 70 వేలు సదరు అ వ్యక్తికి పంపగా.. రూ. లక్ష అకౌంట్‌లోకి వచ్చాయి. కానీ.. నువ్వు పంపిన రూ. 70 వేలు రాలేదంటూ చెప్పి పలు దఫాలుగా రూ. 4.50 లక్షలు స్వాహా చేశాడు. 
►ఎస్‌బీఐ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయ్యిందంటూ నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేశారు సైబర్‌ చీటర్స్‌. బాధితుడికి ఫోన్‌ చేసి కేవైసీ అప్‌డేట్‌ చేయాలని నమ్మబలికి ఓటీపీలు అడిగి రూ. 2.50 లక్షలను లూటీ చేశారు.  
►ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి టీవీలు ఆర్డర్‌ పెట్టగా.. తనని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. నగరంలోని టీవీల వ్యాపారి ఆర్మీ క్యాంటీన్‌లకు టీవీలు సప్‌లై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇండియా మార్ట్‌లో ఓ వ్యక్తి అతి తక్కువ ధరకు టీవీలను అమ్ముతామంటూ యాడ్‌ పెట్టాడు. అది చూసి మాట్లాడగా.. ఎన్వోసీ కూడా పంపాడు. ఆ తర్వాత రూ. 1.50 లక్షలు పంపగా.. ఇప్పటి వరకు టీవీలు రాలేదు.  ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రశీన్‌రెడ్డి వివరించారు.   

చదవండి: (భూత్‌ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top