మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్

Constable Attack On Woman With Knife In Nellore District - Sakshi

‌కోవూరు: వివాహిత మహిళపై ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ, ఆమె భర్త కారణమన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన కోవూరులోని లక్ష్మీనగర్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ సర్వేపల్లి సురేష్‌ కుటుంబం రెండేళ్లక్రితం లక్ష్మీనగర్‌లో రవి, షకున్‌ దంపతుల ఇంటి పక్కన అద్దెకుండేది.  రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఈ ఫిబ్రవరిలో కానిస్టేబుల్‌ భార్య హరిప్రియ ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మృతికి షకున్‌ భర్త రవి కారణమని సురేష్‌ అనుమానించాడు. ఇందుకు ప్రతిగా రవి భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

శనివారం లక్ష్మీనగర్‌కు వెళ్లాడు. ఆ సమయంలో రవి తన పిల్లలను స్కూల్‌ వద్ద వదిలేందుకు వెళ్లాడు. సురేష్ ను చూసి ‘అన్నా మంచినీళ్లు ఇవ్వమంటావా..’ అని షకున్‌ అడిగింది. నీళ్లు వద్దు.. కొద్దిగా పాలు ఇవ్వమనడంతో ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. వెంటనే సురేష్‌ ఇంటి తలుపుకు గడియపెట్టి కిచెన్‌లోకి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోశాడు. ఈలోగా ఇంటికి చేరుకున్న రవి తలుపు పగులగొట్టి లోపలికెళ్లగా.. అతనిపైనా సురేష్‌ దాడికి యత్నించాడు. అతను తప్పించుకుని బయటకు పరుగుతీశాడు.  దీంతో సురేష్‌ అక్కడినుంచి పరారయ్యాడు. షకున్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top