తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!

Conspired Frame Illegal Firearms Case Failing Assassination - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోదరుడితో ఉన్న ఆస్తి వివాదాల నేపథ్యంలో అతడిని హతమార్చాలని భావించిన అన్న నాటు తుపాకీ ఖరీదు చేశాడు. అది సాధ్యం కాకపోవడంతో కనీసం అక్రమ మారణాయుధాల కేసులో ఇరికించే కుట్ర చేశాడు. దీనిని గుర్తించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడిని పట్టకున్నారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్‌ శ్రీనివాస్‌ గురువారం వివరాలు వెల్లడించారు. జేసీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు.

రసూల్‌పుర ప్రాంతానికి చెందిన షేక్‌ మహ్మద్‌ అజ్మతుల్ల అలియాస్‌ షౌకత్‌ ముషీరాబాద్‌లో స్టీల్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి అన్న అబ్దుల్లా, తమ్ముడు సోహైల్‌ ఉన్నారు. సంపన్న కుటుంబానికి చెందిన వీరికి నవాబ్‌కాలనీ, రసూల్‌పుర, బేగంపేట, టోలిచౌకీ, కింగ్‌కోఠి, నాచారం, ఎల్బీనగర్‌ల్లో రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2005లో వీరి తండ్రి కన్నుమూయడంతో వీరి మధ్య ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురూ రసూల్‌పురలోని ఒకే భవనంలో నివసిస్తున్నారు. 15 ఏళ్లుగా వివాదాల పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్న–తమ్ముడు కలిసే తనను ఇబ్బంది పెడుతున్నారని షౌకత్‌ భావిస్తున్నాడు. వీరిని అంతం చేయాలని భావించిన షౌకత్‌ కొన్నేళ్ల క్రితం ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్‌ సలీంను సహాయం కోరాడు.

అతను రూ.5 వేలు వెచ్చించి నాందేడ్‌ నుంచి నాటు తుపాకీ, 10 తూటాలు, రెండు కత్తులు తీసుకువచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి వీటిని తన వద్దే ఉంచుకున్న షౌకత్‌ అదును కోసం ఎదురు చూశాడు. ఈ తుపాకీ చూసిన బంధువులు లైసెన్డ్స్‌ ఆయుధంగా భావించారు. అన్న–తమ్ముడిని హత్య చేయడం సాధ్యం కాకపోవడంతో కనీసం కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని షౌకత్‌ భావించాడు. కొన్ని రోజుల క్రితం తుపాకీ, తూటాలు, కత్తులను ఓ సంచిలో ఉంచాడు. దీనిని ఎవరూ చూడకుండా తన తమ్ముడి వంటింట్లో ఫ్రిడ్జ్‌ కింద పెట్టాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త ఫోన్, సిమ్‌కార్డు కొనుగోలు చేశారు.

వీటిని వినియోగించి పదేపదే టాస్క్‌ఫోర్స్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, అనంతాచారి, అర్వింద్‌ గౌడ్‌ తమ బృందంతో ఆ ఇంటిపై దాడి చేసి సోహైల్‌ను అదుపులోకి తీసుకుని ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నేపథ్యంలో అతడికి వీటితో సంబంధం లేదని తేలింది. దీంతో కాల్‌ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీయగా షౌకత్‌ పేరు వెలుగులోకి రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు.   

(చదవండి: రియల్‌ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top