మాజీమంత్రి ఈటలపై మరో దర్యాప్తు

Complaint That Etela Son Had Trespassed In Medchal - Sakshi

మేడ్చల్‌లో ఆయన తనయుడు భూకబ్జా చేసినట్టు ఫిర్యాదు 

 ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూశాఖలతో దర్యాప్తునకు సీఎం కేసీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై మరో భూకబ్జా ఫిర్యాదు రావడంతో దర్యాప్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశారనీ, తనకు న్యాయం చేయాలని మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్‌ ముదిరాజ్‌  ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ విభాగాలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం సూచించారు. 

ఈటల బెదిరించారని ఫిర్యాదు  
సర్వే నంబర్‌ 77లోని 10.11 ఎకరాల భూమి 1954 ఖాస్రా పహాణి నుంచి 1986 అడంగల్‌ పహాణి వరకు తన తాత పేరు మీద ఉండగా, 1986 తర్వాత పహాణిలో సత్యం రామలింగారాజు, ఇతరుల పేర్లను రెవెన్యూ అధికారులు నమోదు చేశారని మహేశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులోని ఐదెకరాలను ఇటీ వల ఈటల రాజేందర్‌ తనయడు నితిన్‌రెడ్డి, మరో వ్యక్తి సాదా కేశవరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ విషయంపై రాజేందర్‌ను కలసి గోడు వెళ్లబోసుకోగా, ఆయన తనను బెదిరించారని మహేశ్‌ పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top