నైజీరియన్ల డ్రగ్స్‌ దందాకు చెక్‌ | Sakshi
Sakshi News home page

నైజీరియన్ల డ్రగ్స్‌ దందాకు చెక్‌

Published Sat, Jul 8 2023 5:28 AM

Check on Nigerian drug gangs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు కేంద్రంగా వ్యవస్థీ కృతంగా డ్రగ్స్‌దందా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ల ముఠాకు తెలంగాణ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (టీ–నాబ్‌) చెక్‌ చెప్పింది. గత నెలలో ఈ వింగ్‌ ఏర్పడిన తర్వాత పట్టుకున్న తొలి కేసు ఇదే.

ముగ్గురు నిందితుల నుంచి రూ.కోటి విలువైన ఎండీఎంఏ, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు నగర కొత్వాల్, టీ–నాబ్‌ డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం వెల్లడించారు. కొయంబత్తూరులోని బ్యాంకు ఖాతా లు నిర్వహిస్తూ, డెడ్‌ డ్రాప్, సడన్‌ డెలివరీ విధానా ల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఈ ముఠా ఏడాదిలో రూ.4 కోట్ల దందా చేసినట్లు అనుమా నిస్తున్నామని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ తెలిపారు.

నైజీరియా నుంచి 2011లో మెడికల్‌ వీసాపై ముంబై వచ్చి, బెంగళూరులో స్థిరపడిన అగ్బోవో మాక్స్‌వెల్‌ నబూసి ఈ సిండికేట్‌కు సూత్రధారిగా ఉన్నాడు. 2012లో బిజినెస్‌ వీసాపై ముంబై వచ్చిన ఒకెకో చిగోజా బ్లెస్సింగ్‌ గతేడాది మాక్స్‌వెల్‌ వద్దకు చేరాడు. 2021లో స్టూడెంట్‌ వీసాపై బెంగళూరు వచ్చిన ఇకెమ్‌ ఆస్టిన్‌ ఒబాక కూడా వీరితో కలవడంతో డ్రగ్‌ సిండికేట్‌ ఏర్పాటైంది.

డ్రగ్‌ దందా ప్రారంభించిన మాక్స్‌వెల్‌ ప్రస్తుతం ఘనాలో ఉంటున్న స్నేహితురాలు మజీ సహకారంతో కొయంబత్తూరు లోని కెనరా బ్యాంకులో మరో ఘనా జాతీయుడు ఎవ్వాన్‌ ఎరీన్‌ కావా పేరుతో ఖాతా తెరిచాడు. ఆన్‌ లైన్‌ ద్వారా డ్రగ్స్‌ మార్కెటింగ్‌ చేసే ‘మాక్స్‌వెల్‌ అండ్‌ కో’ కొనుగోలుకు ఆసక్తి చూపిన కస్టమర్లతో కేవ లం వీఓఐపీ కాల్స్, వర్చువల్‌ నంబర్లతోనే మాట్లా డతారు.

రేటు ఖరారైన తర్వాత కొయంబత్తూరు లోని బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆపై సరుకును ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పెడ్లర్స్‌ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయిస్తా రు. బెంగళూరుతో పాటు ముంబై, హైదరాబాద్‌లో వీరి కస్టమర్లు ఉన్నారు. డ్రగ్స్‌ను కస్టమర్లకు నేరుగా ఇవ్వరు. నగదు జమ అయినట్లు ఘనా నుంచి సమాచారం వచ్చాక .. ద్విచక్ర వాహనంపై వచ్చి అతడి చేతిలో డ్రగ్‌ ప్యాకెట్‌ పెట్టి సడన్‌గా డెలివరీ చేసి వెళ్లిపోతారు.

డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా వెలుగులోకి.
నైజీరియన్లకు పెడ్లర్స్‌గా పనిచేస్తున్న సంజయ్, భా ను తేజలను హెచ్‌–న్యూ అధికారులు గతంలో అరెస్టు చేశారు. వీరి విచారణలో మాక్స్‌వెల్, బ్లెస్సింగ్, ఇకెమ్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికోసం టీ–నాబ్‌ ఎస్పీ సునీతరెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేష్, ఎస్సై జీఎస్‌ డానియేల్‌ రంగంలోకి దిగారు. బెంగళూరులో నెల రోజులు మకాం వేసి కస్టమర్లుగా నటిస్తూ డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 100 గ్రాముల కొౖకైన్, 300 గ్రాముల ఎండీఎంఏ స్వాధీ నం చేసుకున్నారు. 

వీరి కస్టమర్లను గుర్తిస్తాం
ఈ నిందితులు బెంగళూరు కేంద్రంగా అసోసియేషన్‌ ఆఫ్‌ నైజీరియన్స్‌ పేరుతో సంఘం ఏర్పాటు చేశారు. వివిధ నేరాలు చేస్తూ పట్టుబడిన నైజీరియన్లకు బెయిల్స్‌ వంటి న్యాయ సహాయం కోసం వీళ్లు నిధి కూడా ఏర్పాటు చేశారు. దీనిలోకి రెండు నెలల్లో రూ.8.75 లక్షలు జమయ్యాయి.

ఇలా వ్యవస్థీకృతంగా వీరి వ్యవహారం సాగడం ఆందోళనకర అంశం. కొయంబత్తూరులోని బ్యాంకు ఖాతా విశ్లేషణ బాధ్యతల్ని ఓ కంపెనీకి చెందిన ఆడిటర్‌కు అప్పగించాం. అలా నగరంలో వీరికి ఉన్న కస్టమర్లను గుర్తిస్తాం. – సీవీ ఆనంద్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

Advertisement
 
Advertisement