ఎంపీ సంతోష్‌పై కబ్జా కేసు

BRS leader and former MP Santosh Rao booked for land grabbing - Sakshi

ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా చేశారని ఆరోపణలు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో క్రిమిన­ల్‌ కేసు నమోదైంది. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించారని వచ్చి­న ఫిర్యాదు మేరకు గురువారం ఈ కేసు రిజిస్టర్‌ కాగా... విషయం ఆదివారం వెలుగు­లోకి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–14లోని సర్వే నెంబర్‌ 129/54, ప్లాట్‌ నంబర్‌–4లో నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు (ఎన్‌ఈసీఎల్‌) 1350 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2010లో కరణ్‌ దూబే అనే వ్యక్తి నుంచి ఎన్‌ఈసీఎల్‌ కొనుగోలు చేసింది.

2023 నవంబర్‌ 2 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదిగానే రిజిస్ట్రేషన్ల  శాఖ రికార్డుల్లో ఉండటంతో పాటు ఈ మేరకు ఈసీ కూడా జారీ అయింది. 2023 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదే అని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని ఇతర పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ స్థలంలో రెండు రూమ్‌లు నిర్మించినట్లుగా గుర్తించిన ఎన్‌ఈసీఎల్‌ ప్రతినిధి చింతా మాధవ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము జీహెచ్‌ఎంసీలో విచారించగా ఈ స్థలాన్ని బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లుగా తెలిసిందన్నారు. సంతోష్‌ కుమార్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్‌ అనే వ్యక్తి కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ, బోగస్‌ ఇంటి నంబర్లను తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడని ఆరోపించారు.

విషయం తెలిసిన వెంటనే తాము బంజారాహిల్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విచారించామని, ఈ నేపథ్యంలోనే జోగినపల్లి సంతోష్‌కుమార్, లింగారెడ్డి శ్రీధర్‌లు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లుగా తేలిందని చింతా మాధవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే కాకుండా అందులోకి అక్రమంగా ప్రవేశించి రెండు గదులు నిర్మించడం, జీహెచ్‌ఎంసీలో ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేసి బోగస్‌ ఇంటి నెంబర్లను తీసుకున్న జోగినపల్లి సంతోష్‌ కుమార్, లింగారెడ్డి శ్రీధర్‌లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు వీరిపై క్రిమినల్‌ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top