వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీపై | Sakshi
Sakshi News home page

వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీపై

Published Sun, Feb 26 2023 7:11 AM

Bengaluru: It Employee Attacked For Feeding Dogs - Sakshi

బనశంకరి(బెంగళూరు): పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు జంతు ప్రేమికురాలికి దౌర్జన్యం ఎదురైంది. వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీ పై ఇద్దరు దాడికి పాల్పడిన బెంగళూరు ఆనేకల్‌ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. బృందావన లేఔట్‌లో గల వరుణ్‌ అపార్టుమెంట్‌ నివాసి మీరా తివారి బాధితురాలు. జిగణిలోని బృందావన లేఔట్‌లో వీధి కుక్కలు ఉన్నాయి. మహిళా టెక్కీ మీరా తివారి సొంత ఖర్చుతో వీధికుక్కలకు తిండి పెట్టేవారు. దీనిపై కొందరు ముందు నుంచి గుర్రుగా ఉన్నారు.  

కోడిగుడ్లు తేవడానికి వెళ్లగా  
మీరా తివారి కోడిగుడ్లు తీసుకురావడానికి సమీపంలోని కిరాణా అంగడికి వెళ్లగా అనుసరిస్తూ వీధి కుక్కలు కూడా వెళ్లాయి. ఈ సమయంలో షెడ్‌లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆమెతో గొడవకు దిగారు.  కట్టెలతో దాడికి పాల్పడడంతో కేకలు వేయగా ఆమె తల్లి పరుగున రావడంతో దుండగులు ఉడాయించారు. తరువాత బాధితురాలు 112 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించింది.  

బాధితురాలి ఆక్రోశం  
పోలీసులు చేరుకుని మీరా తివారిని  ఆసుపత్రికి తరలించారు. కుక్కలకు సాయం చేస్తోందని గత మూడేళ్లలో మీరాతివారిపై దాడికి పాల్పడటం ఇది రెండోసారి. పోలీసులు దుండగులను అరెస్ట్‌ చేయడానికి బదులు కట్టుకథలు చెబుతున్నారని మీరా తివారి ఆరోపించింది. నిమ్హాన్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందిన అనంతరం  ఆమె బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం భాష రంగు పులుముకోవడం గమనార్హం. నేను కన్నడలో బాగా మాట్లాడానని, కానీ నేను నాన్‌ లోకల్‌ అని, అహంకారి అని దూషించారని ఆమె తెలిపింది. నేను బెంగళూరులో పుట్టి పెరిగానని, 2018 నుంచి లేఔట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నానని పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement