కాపు కాసి కడ తేర్చారు..

Bavamarudulu And Bava Brutally Ends Life His Brother With Knife In Hyderabad - Sakshi

జీడిమెట్ల: తన అక్కతో తరచు గొడవ పడుతున్నాడనే నెపంతో బావమరుదులు బావతో పాటు అతని సోదరుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటన స్థానికులను భయాందోళను గురిచేసింది.  

జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన మోక వెంకటేష్‌(32) ఏడేళ్ల క్రితం ఉప్పల్‌ చిలకానగర్‌కు చెందిన తనకంటే పెద్దదైన రేఖ(40)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప(4), బాబు(2) ఉన్నారు. వెంకటేష్‌ పెయింటర్‌గా పని చేస్తుండగా రేఖ ఇంటి వద్దనే ఉంటుంది. కాగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

గురువారం ఉదయం వెంకటేష్‌ రేఖల మధ్య గొడవ జరిగింది. ఆమెపై చేయి చేసుకుని సుభాష్‌నగర్‌లోనే ఉండే తల్లి వద్దకు వెళ్లాడు. తన భర్త వెంకటేష్‌ గొడవపడి తనను కొట్టాడని రేఖ చిలుకానగర్‌లో ఉండే తన తమ్ముళ్లకు చెప్పింది. 

దీంతో బావ వెంకటేష్‌పై కోపంతో రగిలిపోయిన రేఖ సోదరులు వినయ్‌(25), మధు(22)లు రాత్రి సుభాష్‌నగర్‌కు వచ్చి వెంకటేష్‌ కోసం కాపు కాస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్‌ తన సొంత సోదరుడైన పోతురాజు(25), తన చెల్లెలి భర్త కృష్ణ(25)లతో కలిసి మద్యం తాగి రాత్రి 10గంటలకు ఇంటికి వస్తున్నాడు. వీరు ముగ్గురు సుభాష్‌నగర్‌ పోచమ్మ గుడి వద్దకు చేరుకోగానే వినయ్‌ వారిస్తూ ఒక్కసారిగా దాడికి దిగాడు.  

తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్‌ కడుపులో పొడుస్తుండగా అతని తమ్ముడు మధు వెంకటేష్‌ను పట్టుకున్నాడు. తన అన్న వెంకటేష్‌ను పొడుస్తుండగా అడ్డుగా వెళ్లిన వెంకటేష్‌ సోదరుడు పోతురాజును సైతం వినయ్‌ విచక్షణ రహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటేష్‌ బావ కృష్ణను సైతం పొడవడానికి ప్రయత్నించగా వెంకటేష్‌ సోదరి అనిత తన భర్తను చంపవద్దని ప్రాధేయపడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోతురాజు అక్కడికి అక్కడే మృతిచెందగా వెంకటేష్‌ అస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. 

పోలీసుల అదుపులో నిందితులు.. 
ఘటనాస్థలికి వెళ్లిన జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, గౌతమ్‌లు పంచనామా నిర్వహించి వినయ్, మధు, రేఖలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మృతుడు పోతురాజుపై 32కేసులు.. 
హత్య కాబడ్డ వెంకటేష్‌ సోదరుడు మృతుడు పోతురాజుపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో 32కేసులు ఉన్నాయి. ఇతను తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి వచ్చి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు.

ఇంటి ఆడపడుచు పసుపుకుంకాలతో సంతోషంగా ఉండాలని ఏ అన్నదమ్ములైన కోరుకుంటారు. కానీ వీరి విషయంలో అది రివర్స్‌గా ఉంది. అక్కను కొట్టాడనే కోపంతో రగిలిపోయిన బావమర్దులిద్దరూ కలసి సొంత బావ ఉసురుతీశారు. అంతేకాకుండా అడ్డుకోవడానికి వచ్చిన బావ తమ్ముడిని సైతం కడ తేర్చారు. బంధాలు, బాంధవ్యాలు మరచి సొంతవాళ్లను చంపుకుంటున్న నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top