HYD: హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. కారు ఢీకొని బీఫార్మసీ విద్యార్థిని మృతి | B Pharmacy Student Spandana Dies in Hyderabad Hit and Run | Sakshi
Sakshi News home page

Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. కారు ఢీకొని బీఫార్మసీ విద్యార్థిని మృతి

Apr 11 2025 10:12 AM | Updated on Apr 11 2025 10:59 AM

B Pharmacy Student Spandana Dies in Hyderabad Hit and Run

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌ అబ్దుల్లా పూర్‌ మెట్‌లో హిట్‌రన్‌ కేసు నమోదైంది. ఈ దుర్ఘటనలో బైక్‌పై వెళుతున్న యువతి దుర్మరణం చెందగా..  యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్‌ పోలీసుల వివరాల మేరకు.. గురువారం రాత్రి తెనాలికి చెందిన ప్రదీప్‌ వర్మ మద్యం సేవించాడు. అనంతరం, తన స్కోడా కారుతో బీభత్సం సృష్టించాడు.  మద్యం మత్తులో కోహెడ వద్ద తన కారుతో బైక్‌ను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి కారుతో పరారయ్యాడు. ప్రదీప్‌ వర్మ కారు ఢీకొట్టడంతో బైక్‌పై వెళుతున్న బీఫార్మసీ విద్యార్థిని స్పందన అక్కడికక్కడే మరణించింది. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

అయితే బైక్‌ను ఢీకొట్టిన తరువాత కోహెడ నుంచి చైతన్యపురి వస్తుండగా ప్రదీప్‌ కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. కారు అద్దం పగలడం, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో ప్రదీప్‌ కారును చైతన్య పురి పోలీసులు అడ్డగించారు. కారును ఆపి ప్రశ్నించారు.  కారు డ్యామేజ్ అయ్యింది.. రిపేర్‌కి వెళ్తున్నానని ప్రదీప్‌ బుకాయించే ప్రయత్నం చేశాడు. అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో.. అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో.. అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు.  

హిట్‌ అండ్‌ రన్‌లో మృతి చెందిన విద్యార్థిని కొప్పు స్పందన(19)ది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లపూర్‌ స్వగ్రామం. ఘట్ కేసర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లోఉంటూ నగరానికి చెందిన ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement