అన్నదాత ఏకరువు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఏకరువు

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

24 మండలాలను మాత్రమే క్షామ పీడిత

ప్రాంతాలుగా గుర్తింపు

నాలుగు మండలాలను పట్టించుకోని ప్రభుత్వం

కేవలం ప్రకటనతో సరిపెడతారా..?

సాయం అందిస్తారా..?

2024లో గుర్తించిన మండలాలకే అందని

ఇన్‌పుట్‌ సబ్సిడీ

ఒకే ఏడాదిలో రెండో గ్రీష్మం వచ్చినట్టు ఎండల ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది సగటు కంటే తక్కువగానే వర్షపాతం నమోదైంది. భానుడి ప్రతాపానికి 20 ఏళ్ల మామిడి చెట్టు కూడా ఎండుముఖం పడుతోంది. వేరుశనగ చుక్క నీరందక వడలిపోతోంది. దీంతో రైతాంగం పంటల సాగుకు సాహసించలేక దిగాలుపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా లోని 24 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వాటిలోని రైతులకు సకాలంలో పరిహారం చెల్లిస్తుందా అనేది అనుమానంగానే కనిపిస్తోంది.

సాక్షి, చిత్తూరు : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 424.7 మి.మీ ఉండాలి. కానీ, నమోదైన వర్షపాతం మాత్రం 197.9 మి.మీ. అంటే 232.8 మి.మీ వర్షపాతం లోటుగా ఉంది. 54 శాతం లోటు వర్షపాతం నమోదవడం ప్రమాద ఘటింకలను మోగిస్తోంది. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఎండల వేడిమి ఎక్కువవుతోంది. భవిష్యత్తులో పంటల సాగు, తాగునీటికి ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడినప్పటికీ ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు సరిపడా నీరందని పరిస్థితి. ఈ తరుణంలో జిల్లాలోని 28 మండలాలను కరువుగా ప్రకటించకుండా.. నాలుగు మండలాలను మినహాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాటికి చోటులేదేం..?

ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, చిత్తూరు అర్బన్‌, చిత్తూరు రూరల్‌, గుడిపాల, పూతలపట్టు, తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం, యాదమరి, పలమనేరు, బైరెడ్డిపల్లె, పెద్ద పంజాణి, వి.కోట, గంగవరం, గంగాధరనెల్లూరు, వెదురుకుప్పం, పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం, పులిచెర్ల, రొంపిచెర్ల ఉన్నాయి. కానీ నగరి నియోజకవర్గంలోని నిండ్ర, విజయపురం, నగరి మండలాలతోపాటు జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం మండలాన్ని కరువు జాబితాలో చేర్చలేదు. ఈ మూడు మండలాల్లోనూ కనీస వర్షపాతం నమోదుకాలేదు.

సాయం అందిస్తారా..?

కరువు మండలాలను ప్రకటించిన తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం జిల్లా వ్యవసాయశాఖ పంట నష్టం అంచనా తయారు చేయడం, అనంతరం కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం పరిశీలించి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. పంట నష్టం కింద కేంద్రం 40 శాతం, రాష్ట్రం 60 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రైతులకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మండలాలను ప్రకటించడంతో త్వరలోనే కేంద్ర బృందం పర్యటన ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇస్తారు. పంట నష్ట ఉపశమనం (స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌) ప్రకారం వరి, వేరుశనగకు హెక్టారుకు రూ.25 వేలు, కంది, మొక్కజొన్న, కంది, రాగి, జొన్న లాంటి పంటలకు హెక్టారుకు రూ.15 వేలు ఇవ్వాలి. అయితే 2024 ఖరీఫ్‌లో చంద్రబాబు ప్రభుత్వం 3 తీవ్ర, 13 మండలాలు మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినా.. ఇప్పటికీ పరిహారం అందకపోవడం గమనార్హం.

కుప్పం నుంచి నగరి వరకు కరువు విలయతాండవం

అన్ని మండలాలను ప్రకటించాలి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అంతటా కరువు తాండవిస్తోంది. ఈసారి అసలు వర్షాలు ఎక్కడ పడ్డాయి. భూ గర్భ జలాలు పూర్తిగా అడుగంటి పో యి పశువులకు మేత లేదు. నీరు లేక వ్యవసాయ బోర్లు చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రైతులు వేసిన కొద్దిపాటి పంటలు కూడా నిలబడలేదు. రైతాంగం అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ప్రభు త్వం 24 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం తగదు. మిగిలిన నాలుగు మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చాలి. – ఉమాపతి నాయుడు,

అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

మేము ఏం పాపం చేశాం

ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయకపోయినా భూమి బీడుగా ఉండకూడదనుకున్నాం. అప్పులు చేసి 2.30 ఎకరాల్లో వేరుశనగ పంట వేశాను. కానీ, వర్షాల సక్రమంగా పడకపోవడంతో కళ్ల ముందే పంట పోతా ఉండాది. మండలం మొత్తం వర్షాల సరిగా కురవలేదు. రైతులు సాగు చేసిన అన్ని పంటలు పోయినాయి. కానీ, మా మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. ఇది చాలా బాధగా ఉండాది. మేము ఏం పాపం చేశాం. వెంటనే పాలసముద్రం మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించాలి. రైతులకు సాయం అందించాలి. – అలీ భాయ్‌, రైతు, పాలసముద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement