చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి జిల్లా పరిషత్ కార్యాలయానికి శనివారం చేరింది. తెలుపు, గులాబీ రంగు బ్యాలెట్ పేపర్స్, మాన్యువల్ బుక్స్, ఎలక్షన్ లా బుక్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ బుక్స్, నిబంధనల పుస్తకం, అభ్యర్థుల వివరాల నమోదు పుస్తకాలు, పోస్టల్ చాలెంజ్ , ఓటర్, అంధ ఓటర్ల కవర్లు తదితర మొత్తం 20 రకాల సామగ్రి వచ్చింది. ఈ మేరకు సామగ్రిని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు పరిశీలించారు.
వేగంగా ఆర్‌డీఎస్‌ఎస్ పనులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగంగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. శనివారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్మాణ, ఎంఆర్‌టీ విభాగాల అధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఆర్‌డీఎస్‌ఎస్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నెలకు 30 ఫీడర్ల చొప్పున పనులను కచ్చితంగా చేయాలని నిర్దేశించారు. పనులు త్వరగా పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పాడైన, పాతబడిన కరెంటు స్తంభాలను మార్చాలని సూచించారు. పల్లెల్లో విద్యుత్ అంతరాయం, లో ఓల్టేజీ సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాడైన ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో బాగుచేసి ఇవ్వాలని కోరారు. అవసరమైన మెటరీయల్స్ కోసం ప్రతిపాదన పెట్టి తెప్పించుకోవాలని స్పష్టం చేశారు. ఎండలు తగ్గకపోవడంతో ఫెయిల్యూర్ శాతంలో పెద్దగా మార్పులేదని తెలిపారు. సమావేశంలో ఈఈలు భాస్కర్‌నాయుడు, బాబు పాల్గొన్నారు.
తపాలా బీమాతో భరోసా
చిత్తూరు కార్పొరేషన్: తపాలా బీమా కుటుంబానికి భరోసాగా ఉంటుందని పోస్టల్ సూపరింటెండెంట్ కిరణ్, తపాలా బ్యాంక్ మేనేజర్ నాగార్జున తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు కుప్పం, తవణంపల్లెకు చెందిన శ్రీనివాసులు(57), వెంకటేశులు(49) మరణించారన్నారు. వారు ప్రమాదబీమా చెల్లించడంతో నామినీలకు మొత్తం రూ.12 లక్షలకు చెక్కులను అందజేశామన్నారు. పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన కింద గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ రూ.565, రూ.436 ఏడాదికి చెల్లించారన్నారు. వారు ప్రమాదవశాత్తు చనిపోవడంతో శ్రీనివాసులకు వచ్చిన రూ.10 లక్షలను ఆయన భార్య మంజులకు, వెంకటేశులకు వచ్చిన రూ.2 లక్షల బీమా సొమ్మును ఆయన భార్య సుజాతకు అందజేశామన్నారు. వినియోగదారులు చెల్లించే చిన్న మొత్తం ఆపదకాలంలో వారు లేని సమయంలో కుటుంబసభ్యులకు భరోసాగా ఉంటుందని తెలిపారు. బీమాపై అవగాహన పెంపొందించుకుని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తపాలాశాకఽ అధికారులు భాస్కర్, కార్తీక్ పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన టమాట
వి.కోట: వి.కోట మార్కెట్‌లో శనివారం టమాట 18 కిలోల బాక్సు రూ.200 నుంచి అత్యధికంగా రూ.500 ధర పలికింది. స్వల్పంగా రేటు పెరిగినప్పటికీ కూలీలు, ఆటో బాడుగ కలిపితే కొంత గిట్టుబాటు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే ఆవకాశమున్నట్లు రైతులు, మండీ యాజమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. టమాటాకు డిమాండ్ పెరగడంతో కొన్నిరోజులుగా ధరలు నిలకడగా ఉన్నట్లు మండీ యాజమానులు వెల్లడిస్తున్నారు.


