నీట్‌పై నిప్పులు! | - | Sakshi
Sakshi News home page

నీట్‌పై నిప్పులు!

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● పేపర్‌ లీకేజీతో వేలాదికుటుంబాల్లో చీకట్లు ● ఎన్‌టీఏ అంటేనే లీకేజీనా? ● కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా నీట్‌ ప్రవేశ పరీక్షకు 1,060 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,020 మంది మే 3న జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రవేశ పరీక్ష పత్రం లీకేజీ కావడంపై క్షేత్ర స్థాయిలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యను అభ్యసించాలని కలలుగన్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి.

లీకేజీ మాఫియా పంజా

వైద్యుడు కావాలనే లక్ష్యంతో రెండేళ్ల పాటు కోచింగ్‌ సెంటర్లలో గడిపారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని లక్షల రూపాయల ఫీజుల రూపంలో కోచింగ్‌ సెంటర్లకు చెల్లించారు. తీరా పరీక్ష పూర్తయ్యాక పేపర్‌ లీక్‌ అయ్యిందని.. పరీక్షను రద్దు చేశారు. తాము చదివింది పరీక్ష రాయడానికా, అక్రమాలకు బలి కావడానికా అని విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు.

కుమిలిపోతున్న తల్లిదండ్రులు

తమ పిల్లలు డాక్టర్లు అవుతారని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. అప్పు చేసి చదివించిన చదువు లీకేజీల పుణ్యమా అని బూడిదలో పోసిన పన్నీరు కావడంతో వారి ఆవేదన వర్ణనాతీతం.

నైతిక బాధ్యత ఎవరిది?

లక్షలాది మంది విద్యార్థులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించి, వ్యయప్రయాసాలకోర్చి పరీక్ష రాస్తే.. దాన్ని రద్దు చేయడం అంటే వారి ఆశలపై నీళ్లు చల్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఒత్తిడిలో విద్యార్థులు

నీట్‌ రద్దు నిర్ణయం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్‌ కావాలంటే ఆ పాత ఉత్సాహం, ఏకాగ్రత కుదరదని విద్యార్థులు వాపోతున్నారు. కేంద్ర విద్యాశాఖ, ఏజెన్సీ చేసిన తప్పిదానికి తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు (ఫైల్‌)

ఎన్‌టీఏ తీరుపై విమర్శలు

పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల్సిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ లీకేజీ ఏజెన్సీగా మారిందా..? అంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తున్నాయి. అక్రమార్కుల లాభం కోసం మెరిట్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

నీట్‌ ప్రవేశ పరీక్ష రద్దుపై జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు రగిలిపోతున్నారు. రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి.. కష్టాన్ని ఆయుధంగా మలచిన తమకు నిరాశే ఎదురైందని కుమిలిపోతున్నారు. అక్రమార్కుల లీకేజీతో ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ఎన్‌టీఏ తీరునూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కూడా దుయ్యబడుతున్నారు.

విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన నీట్‌

Advertisement
 
Advertisement
Advertisement