వేలాదిగా తరలివస్తున్న భక్తులు ఆకట్టుకున్న భక్తుల వేషధారణ నేడు నిమజ్జనం
గంగరంగ
చిత్తూరులో గంగజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నడివీధితో పాటు పలు ప్రాంతాల్లో గంగమ్మను కొలువుదీర్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొందరు వినూత్న వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా, మరికొందరు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి తదితర ప్రాంతాల్లో గంగమ్మ జాతర ఉత్సాహంగా సాగింది. విద్యుద్దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గంగమ్మను దర్శించుకున్న ఎస్పీ
చిత్తూరు నడివీధిలో కొలువుదీరిన గంగమ్మ తల్లిని ఎస్పీ తుషార్‌డూడీ దర్శించుకున్నారు. వారికి జాతర నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి పసుపు, కుంకుమ అందించారు. ముందుగా జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, నిఘా తదితర విషయాలను జాతర మండపం వద్ద ఎస్పీ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
భక్తిశ్రద్ధలతో చిత్తూరు గంగ జాతర
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
చిత్తూరులో రెండో రోజు గంగమ్మ తల్లి నిమజ్జనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నడివీధి గంగమ్మ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


