● ఆలయ చైర్మన్, పాలకవర్గం మధ్య కుదరని సఖ్యత ● కొనసాగుతున్న బలవంతపు వసూళ్లు
కుప్పం: పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, అధికా పార్టీ నేతలు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరక రెండు వర్గాలుగా విడిపోయాయి. దీనికి తోడు పూజార్ల బృందం మరో వర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో దేవాలయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది.
పారని పొదుపు మంత్రం
గత ఏడాది అమ్మవారి దేవాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి దేవాలయానికి కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి కోసం ఇద్దరు ప్రయివేట్ వ్యక్తల దుకాణాలు కోనుగోలు చేసి దారి ఏర్పాటు చేశారు. దీనికి ఇంకా రూ.23 లక్షలు దాకా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని కూడా చైర్మన్ ఆలయం కోసం కొనుగోలు చేశాడు. వీరందరికీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీనికి చైర్మన్ పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు. జాతర సింపుల్‌గా చేసి మిగిలిన డబ్బును ఆ స్థలాలకు చెల్లించాలని కోరారు. దీనికి అధికార పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతర సింపుల్‌గా చేసేది లేదని తేల్చేశారు. దీనికితోడు పాలకవర్గ సభ్యులు, చైర్మన్ మధ్య సమన్వయం కుదరడం లేదు. కమిటీ సభ్యులు పేరుకే గానీ తమకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బలవంతంగా వసూళ్లు
జాతర నిర్వహణకు అధికార పార్టీ పట్టణంలో బలవంతపు వసూళ్లకు పాల్పడు తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణం చుట్టూ ఉన్న వివిధ ఫ్యాక్టరీల వద్దకెళ్లి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి రూ.50 వేలు రాసి చందా రసీదు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు వ్యాపార వేత్తల నుంచీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి జాతరకు భక్తిశ్రద్ధలతో విరాళాలు సేకరించాలి గానీ..ఇలా బలవంతపు వసూళ్లు తగదని స్థానికులు పేర్కొంటున్నారు.


