హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్‌

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం

బంగారుపాళెం: హత్యాయత్నం కేసుకు సంబంధించి మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన కిరణ్‌ కు, అదే గ్రామానికి చెందిన నాగేంద్రపై అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్‌ అతని బావమరిది దామోదరంతో కలసి నాగేంద్రపై చాకుతో కడుపు, భుజంపై పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించి కిరణ్‌, దామోదరంను సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ, సిబ్బంది బలిజపల్లె ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. ఆపై ముద్దాయిలను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

నూతన వసతులతో

ఆదర్శ పాఠశాల నిర్మాణం

రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల తరగతి గదులను నూతన వసతులతో నిర్మించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మంగళవారం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 12వ తేదీనాటికి విద్యార్థులకు సౌకర్యంగా మొదటి అంతస్తు తరగతి గదులను పూర్తి చేయాలన్నారు. తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని ఎంఈవో శ్రీనివాసులును ఆదేశించారు. ప్రిన్పిపల్‌ రెడ్డిప్రదీప్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎంఈవో శ్రీనివాసులు, డీఈ సాయి, ఏఈ వేణుగోపాల్‌, కాంట్రాక్టర్‌ బహ్మనందరెడ్డి పాల్గొన్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

పలమనేరు: పలమనేరు–కుప్పం రహదారిలోని కొలమాసనపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలం, ధర్మపురి అగ్రహారానికి చెందిన మణి(32) మృతి చెందాడు. స్వగ్రామం నుంచి బైక్‌పై పలమనేరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు కొలమాసనపల్లి వద్ద అతన్ని ఢీకొందని స్థానికులు తెలిపారు. కాగా మృతునికి వివాహమై, మూడేళ్ల కుమార్తె ఉండగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి. గత కొన్నాళ్లుగా పలమనేరు నుంచి బైరెడ్డిపల్లి మార్గంలో ఐదుగురు ఇలాంటి ప్రమాదాలతో నే మృతి చెందారు. బాగున్న తారు రోడ్డుపై కాంట్రాక్టర్ల లాభం కోసం ప్యాచ్‌వర్క్‌ చేయడంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిచారు. కేసు విచారణలో ఉంది.

గోడ దూకి గోవా వెళ్లాడు!

చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్‌ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్‌ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement