పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
సాక్షి, టాస్క్‌పోర్సు: కార్వేటినగరం మండలం, అమ్మపల్లి పంచాయతీ, పొన్నగల్లు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఓ టీడీపీ నాయకుడు కూల్చివేశాడు. సదరు నాయకుడు కాంట్రాక్టర్ అవ తారమెత్తి రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం ఆ పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకావం ఉంది. కానీ మరమ్మతు పనుల పేరుతో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా పాఠశాల భవనాన్ని కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన తీరేవేరు
ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ నాయకుడి ఆగడాలు శ్రుతిమించడం పరిపాటిగా మారాయి. 2024–25 మధ్య కాలంలో కూడా ఇదే రీతిలో అరచాకాలు సాగించినట్టు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం అవసరం లేకున్నా నిర్మాణానికి పూనుకున్నట్టు పేర్కొంటున్నారు. అక్కడ అడ్డుగా ఉన్న చింత చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికి సొమ్ము చేసుకున్నట్టు వెల్లడిస్తున్నారు. అలాగే చెరువుల్లో సొంతంగా చేపల పెంపకానికి కొంత వరకు ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పొన్నుగల్లు ప్రాథమిక పాఠశాల కూల్చివేత
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
పొన్నగల్లు ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు గురైంది. కానీ దాని పునర్నిర్మాణానికి రూ.6.8 లక్షలు ఎంపీ నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టాం. జిల్లా అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– విజయకుమార్, మండల విద్యాశాఖ అధికారి, కార్వేటినగరం


