సరెండర్‌ | - | Sakshi
Sakshi News home page

సరెండర్‌

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

చిత్తూరు కార్పొరేషన్‌: మార్కెట్‌ వాల్యూ ఆడిట్‌ (ఎంవీఅండ్‌ఏ) రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను రాష్ట్ర ఐజీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. చిత్తూరులోని రిజిస్ట్రేషన్‌ భవనంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్‌, మార్కెట్‌ వాల్యూ ఆడిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, డీఐజీ కార్యాలయాలున్నాయి. అక్కడ సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణలో వాస్తవమని తేలడంతో ఎంవీఅండ్‌ఏ జిల్లా రిజిస్ట్రార్‌.. సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు.

గణనాథుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌రాయ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఓం శక్తి ఆలయంలో చోరీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలం 5.వెంకటాపురం గ్రామంలోని ఓం శక్తి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి తాళిబొ ట్టు, హుండీని అపహరించుకెళ్లారు. సోమవా రం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టిన విషయాన్ని గ్రామస్తులు గమనించి.. పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఓం శక్తి ఆలయంలో జరిగిన చోరీపై ఆరా తీశారు.

టీచర్లకు ఈఎల్స్‌ తప్పనిసరి

చిత్తూరు కలెక్టరేట్‌ : సెలవుల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఈఎల్స్‌ మంజూరు చేయాలని ఆపస్‌ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల విధులు, ఇతర విద్యాకార్యక్రమాల్లో పాల్గొంటున్న టీచర్లకు సంపాదిత సెలవులు (ఈఎల్‌)లు తప్పనిసరిగా మంజూరు చేయాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించే టీచర్లు, హెచ్‌ఎంలు, అడ్మిషన్‌ల ప్రక్రియలో పాల్గొనే వారందరికీ తగిన ప్రయోజనాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలన్నారు.

సోలార్‌ పనులు

వేగం పెంచాలి

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పనులు వేగం పెంచాలని ట్రాన్స్‌కో సీఎండీ శివశంకర్‌ ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్‌ఈ, ఈఈలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 19 వేల సర్వీసుల ఏర్పాటును ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1,100 ప్యానల్స్‌ బిగించారన్నారు. రోజూ 150 ప్యానల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అమర్‌బాబు, ఈఈ మునిచంద్ర, సురేష్‌ పాల్గొన్నారు.

హత్యాయత్నం

కేసు నమోదు

బంగారుపాళెం: ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివాహేతర సంబంధం కలిగివున్నాడనే నెపంతో మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన సంపత్‌ కుమారుడు కిషోర్‌, అతని బావమర్థి, అదే గ్రామానికి చెందిన నాగేంద్రబాబుపై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు. ఈదాడిలో నాగేంద్రబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు నాగేంద్రబాబును చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు కిషోర్‌, దామోదరంపై హత్యయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement