పింఛనో రామచంద్రా!
ఇతను చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండ లం, ఎంకేపేటకు చెందిన శంకర్. కంటిచూపు లేదు. ఏ పనీ చేయలేడు. సదరం పరీక్షల్లో డాక్టర్లే స్వయంగా 100 శాతం వికలత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఏం లాభం ?.. గత రెండేళ్లుగా కొత్త పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా ఫలితం లేదు.
దివ్యాంగుల వేదన
కొత్త పింఛన్ల కోసం దివ్యాంగుల బాధలు అన్నీఇన్నీకావు. శారీరక వైకల్యం వల్ల కదల్లేని స్థితిలో ఉన్న వారు సైతం అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక అధికారి దగ్గరకు వెళ్తే మరొకరి దగ్గరకు సాగనంపడమే తప్ప, ఏ ఒక్కరూ బాధ్యతగా దరఖాస్తులను పరిష్కరించకపోవడం వారిపాలిట శాపంగా మారుతోంది.
చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్‌ల మంజూరు విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని మరో డ్రామాకు తెరలేపింది. అర్హులకు సామాజిక భద్రత కల్పిస్తామని గొప్పలు చెబుతున్నా, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సచివాలయాల్లో ఇప్పటికీ ఆప్షన్‌లు ఇవ్వకపోవడం అభాగ్యుల పాలిట శాపంగా మారింది. కొత్త పింఛన్‌ల డ్రామా పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్‌లపై సరికొత్త డ్రామాలకు తెరలేపుతోంది. పింఛన్ల కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా ఎదు రు చూస్తున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తోంది. వేలాది మంది అర్జీలు అందజేస్తున్నా వాటిని బుట్టదాఖలు చేస్తూ అభాగ్యుల సహనాన్ని పరీక్షిస్తోంది.
ఏళ్లు గడుస్తున్నా..
వృద్ధాప్యం మీద పడి, కళ్లు సరిగ్గా కనిపించక, చేతులు వణుకుతున్నా.. ఏదో ఒక రోజు పింఛన్ రాకపోతుందా అనే ఆశతో జిల్లాలో వేల మంది వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక దానిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బడ్జెట్ సాకులు, సాంకేతిక కారణాలు చూపిస్తూ వాయిదాల పర్వాన్ని నడుపుతున్నారు.
జూన్ 12 నుంచి అంట!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాజాగా మరో కొత్త డ్రామాకు తెరలేపింది. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా జూన్ 12 నుంచి కొత్త పింఛన్‌లు అంటూ బుకాయిస్తోంది. దీనిపై దివ్యాంగులు రగిలిపోతున్నారు.
నాడు పండుగలా
పింఛన్‌ల పంపిణీ
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేవారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన తర్వాత అర్హులైన వారు పింఛన్‌లకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఏటా జనవరి, జూలై నెలల్లో ప్రత్యేకంగా కొత్త పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసేవారు. వలంటీర్ లబ్ధిదారుల ముంగిటకే పింఛన్‌లను చేరవేసేవారు.
పెండింగ్ దరఖాస్తుల వివరాలు
కుప్పం 1,215
పలమనేరు 989
నగరి 864
చిత్తూరు 1,245
గంగాధరనెల్లూరు 948
పూతలపట్టు 1,142


