చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పారదర్శకంగా సమాచారం అందించాలన్నారు. ఇళ్ల గణన ఈనెల 30 వరకు సాగుతుందన్నారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంటుందన్నారు.
జాతరకు అంతరాయం లేని విద్యుత్
చిత్తూరు కార్పొరేషన్: గంగమ్మ జాతర సందర్భంగా డివిజన్ పరిధిలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. లైన్‌ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జూని యర్ లైన్‌మెన్లు కలిపి మొత్తం 30 మంది సిబ్బంది అమ్మవారిని ప్రతిష్టించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు 24 గంటల పాటు రెండు రోజులు అందుబాటులో ఉంటారన్నారు.
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటామని పేర్కొన్నారు.
బడి బస్సుల తనిఖీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని విద్యాసంస్థల బస్సులపై సోమవారం జిల్లా రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న 928 పాఠశాలలు, కాలేజీ బస్సుల్లో ఇప్పటివరకు 520 బస్సులను మోటారు వాహన పరిశీలకులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 98 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీటీసీ నిరంజన్‌రెడ్డి తెలిపారు. తనిఖీల సందర్భంగా విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యాసంస్థల యజమాన్యాలకు సూచించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్ వంటి భద్రతా పరికరాలు ఉండాలన్నారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెనన్స్, బ్యాడ్జి కలిగి ఉండాలని చెప్పారు.
డయల్ యువర్
ఎస్‌ఈకి ఆరు సమస్యలు
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో పలమనేరులోని గంటావూరు, వినాయకనగర్ ప్రాంతాల్లో ఓల్టేజీ సమస్య ఉందని వినియోగదారుడు భూపతినాయుడు, వెంకటరావ్ ఫిర్యాదు చేశారు. అలాగే గంగవరం మండం, కీల్లపట్ల పంచాయతీలో అనధికారికంగా సర్వీసును లైన్‌మన్ ఇచ్చారని సుబ్రమణ్యం తెలిపారు. దొంగతనం జరిగిన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో మరొకటి ఇవ్వడం లేదని విజయపురం నుంచి శ్రీరాములరాజు తెలిపారు. దెబ్బతిన్న కరెంటు స్తంభాన్ని మార్పు చేయాలని కొత్తపల్లెమిట్టకు చెందిన స్వర్ణలత ఫిర్యాదు చేయగా, బంగారుపాళ్యంలో అనధికారికంగా ట్రాన్స్‌ఫార్మర్ పెట్టారని వాటి పై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
వెకేషన్ కోర్టు
షెడ్యూల్ విడుదల
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతా ల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.


