నగరి : వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు వినియోగిస్తున్న గ్రావెల్ రోడ్డును ఆక్రమిస్తున్నారంటూ స్థానిక రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని కాకవేడు మిట్టిండ్లు నుంచి ఒంటిండ్లుకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మిట్టిండ్లుకు చెందిన టీడీపీ నేతలు వాసునాయుడు, భాస్కర్ జేసీబీతో రోడ్డును చెక్కించి మట్టిని తమ భూముల్లో కలుపుకుంటున్నారని ఆరోపించారు. రైతులు, గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్‌వెంకటరత్నం రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిట్టిండ్లు–ఒంటిండ్ల మధ్యనున్న ఈ గ్రావెల్ రహదారి ద్వారా స్థానిక రైతులు తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మామిడి తోటలు అధికంగా ఉండడంతో ట్రాక్టర్లు, కాయలు తరలించే లారీలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నాయని వివరించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న మామిడి తోటల యజమానులైన టీడీపీ నేతలు రహదారిని ఆక్రమించుకోవడమే కాకుండా, కొండనీరు పారే కాలువకు సంబంధించిన నీటి పైపులను కూడా ముందుకు జరిపి మరింత స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం’ అంటూ సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని స్థానిక రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలు అధికారులకు సూచించారు.


