స్వచ్ఛతలో నిలబడతారా..? | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతలో నిలబడతారా..?

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

● స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీపడుతున్న చిత్తూరు ● నగర సుందరీకణ పనులపై కలెక్టర్‌ పర్యవేక్షణ ● టాప్‌ –10లో ఉండేందుకు గట్టిగా ప్రయత్నం ● క్షేత్రస్థాయిలో రాష్ట్ర బృందాలు.. త్వరలో కమిటీ

మన ఊరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్‌. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 4,432 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం మెరుగుపై స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికై న ఉత్తమ మునిసిపాలిటీలకు కేంద్రం నిధులను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఈ పోటీల్లో నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

చిత్తూరు అర్బన్‌ : జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలతో పోలిస్తే పారిశుద్ధ్య నిర్వహణ చిత్తూరు నగరంలో కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. ఇదే సమయంలో మురికివాడల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు చోద్యంచూస్తున్నారు. నగరాన్ని ఓడీఎఫ్‌ (బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం)గా అమలు అంతంత మాత్రంగానే ఉంది. పీసీఆర్‌ కళాశాల, కట్టమంచి చెరువు తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో ఓడీఎఫ్‌ సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇక నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో రంగులు అద్దడం, మొక్కలు ఏర్పాటు చేయడం, చిన్నపాటి ఉద్యానవనాలు నిర్మిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు.

పడిలేస్తూ..

గతేడాది జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో దేశంలో చిత్తూరుకు 273వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. గతం నేర్పిన పాఠాలతో ఈసారి చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అంటే ఏమిటి, ఎలా చేస్తున్నారు, నగరం సుందరంగా ఉండాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికితోడు వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, కూరగాయల మార్కెట్‌, చేపల మార్కెట్‌, ఇతర సూపర్‌ బజార్ల వద్ద తడి–పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందజేసేలా చైతన్యం కల్గిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వ్యవహరిస్తుండడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో సలహాలు ఇస్తూ అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నగరాన్ని టాప్‌–10లో నిలబెడుతుందని ఆశతో చూస్తున్నారు.

వచ్చేనెల ఫలితాలు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు ముగింపుదశలో ఉన్నాయి. అధికారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలకు ఏ మేరకు చేరువయ్యాయో..? తెలుసుకోవడానికి రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వచ్చేవారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందాలు సైతం నగరంలో పర్యటించి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చిత్తూరు స్థానం ఇలా..

సంవత్సరం జాతీయ ర్యాంకు

2020–21 81

2021–22 137

2022–23 153

2023–24 143

2024–25 273

మా ప్రయత్నం చేస్తున్నాం

ఈ పోటీల్లో చిత్తూరును ఉత్తమ స్థానంలో నిలపడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. మొబైల్‌ టాయ్‌లెట్లు పెట్టాం. పచ్చటి మొక్కలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాం. ఎందుకూ పనికిరాని టైర్లు, ఇతర వస్తువులతో కళాఖండాలు, ఆకృతులు తయారుచేసి ప్రజల సందర్శన కోసం పెడుతున్నాం. మాకై తే మెరుగైన స్థానం వస్తుందని ఆశిస్తున్నాం. ఫలితం ఎలా ఉన్నా చిత్తూరును వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మునిసిపాలిటీగా చేస్తాం. – పి.నరసింహప్రసాద్‌, కమిషనర్‌, చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌

Advertisement
 
Advertisement
Advertisement