పిడుగుపాటును ముందుగా పసిగట్టే దామిని, వజ్రపాత్ యాప్‌లు అవగాహన కలిగి ఉండాలంటున్న నిపుణులు
చిత్తూరు కలెక్టరేట్: వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కడో ఒకచోట పిడుగులు పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగుపాటు వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి. ఎక్కువగా పశువుల కాపరులు, పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికులు, రైతులు ప్రాణాలు కోల్పోతుంటారు. మూగజీవాలు సైతం మృత్యువాత పడుతుంటాయి. సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిడుగుల ముందస్తు సమాచారం తెలుసుకునే యాప్‌లపై అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిడుగులు పడే సమాచారాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీయోరాలజీ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘దామిని, వజ్రపాత్’ యాప్‌లతో తెలుసుకోవచ్చు. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉండే ఆప్షన్లను అనుసరించి ఏ ప్రాంతంలో పిడుగు పడుతోంది, మనం ఎంత వరకు సురక్షితం అనే వివరాలు తెలుసుకోవచ్చు. చాలా మందికి అవగాహన లేక వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదు. వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్య తల ఉంచి, రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా కూర్చోవాలి. పశు సంపదను సురక్షిత ప్రాంతాల్లో కట్టేయాలి. ఆరు బయట ప్రదేశాలు, రేకుల షెడ్లు, వరండాలో ఉండొద్దు. ఇళ్లలో ఉన్నవారు తలుపులు, కిటికీలు మూసేసి, విద్యుత్తు సరఫరాను ఆపేయాలి.
పరిహారం పొందడం ఎలా?
పిడుగుపాటుతో మృతి చెందినా, లేదాగా యపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నష్టపరిహారం అందిస్తున్నాయి. మృతుడి వివరాలు, పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్ తదితర వివరాలతో తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. వాటిని అధికారులు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదించి మృతుడి వయసు ఆధారంగా నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తారని రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు.
కుప్పం, పలమనేరు పరిసర ప్రాంతాల్లో గతంలో వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడి రైతులు మృతిచెందారు. అలాగే నగరి, గంగాధరనెల్లూరు పరిసరాల్లో గుట్టలపై మేత మేస్తున్న గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. ఇంకా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాటుతో పలువురు గాయపడ్డారు. పలు చెట్లు కాలిపోయాయి. ఇలా వర్షాకాలంలో కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట పిడుగులు పడడం సర్వసాధారణం. ఈ క్రమంలో పిడుగు పడే ప్రాంతాల గురించి తెలియజేసే దామిని, వజ్రపాత్ యాప్‌లను ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటిపై అవగాహన కలిగి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


