మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మూడు ఎకరాల చెరుకుతోట దగ్ధం

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం ● న్యాయం చేయాలని రైతు గురుమూర్తి వేడుకోలు

● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం ● న్యాయం చేయాలని రైతు గురుమూర్తి వేడుకోలు

నగరి : మండలంలోని దామరపాకం పంచాయతీ టీవీకండ్రిగ గ్రామంలో ఆదివారం రైతు గురుమూర్తికి చెందిన మూడు ఎకరాల చెరుకుతోట అగ్నికి ఆహుతైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాలిపోవడంతో సుమారు రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించినట్టు రైతు ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకుతోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తోట మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మూడు ఎకరాల్లోని చెరుకు పూర్తిగా దగ్ధమైంది. రైతు గురుమూర్తి మాట్లాడుతూ అప్పు చేసి చెరుకు పంట సాగు చేశానని తెలిపారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందన్నారు. ఎకరాకు సుమారు 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల చెరుకు కాలిపోయిందని, రూ.4.5 లక్షల వరకు నష్టం సంభవించిందన్నారు. అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఆకతాయిలు బీడీ, సిగరెట్‌ కాల్చి పడేయడం వల్ల మంటలు వ్యాపించాయా లేక షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయా అన్న విషయం తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు.

తమిళనాడు బియ్యం స్వాధీనం

పెనుమూరు(కార్వేటినగరం): తమిళనాడు నుంచి తరలిస్తున్న రూ.2.20 లక్షల విలువ జేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మండల పరిధిలోని మఠంపల్లి క్రాస్‌ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. మూడు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయన్నారు. వాటిని ఆపి తనిఖీ చేయగా అందులో రూ.2.20 లక్షల విలువ జేసే 12.25 టన్నుల తమిళనాడు బియ్యం బయట పడ్డాయన్నారు. బియ్యంతో పాటు పట్టుబడిన ఎన్‌.రామచంద్ర, ఎ.చలపతి, కె.రెడ్డెప్ప, సి.భానుమూర్తి తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పేదల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని రైస్‌ మిల్లులకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా ఈ అక్రమ రవాణాలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా నిందితులపై జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో అక్రమ బియ్యం రవాణా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులు అక్రమ రవాణాకు వాడిన టాటా హెక్సా కారు, టాటా 407 వాహనం, ఐషర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా భక్తులకు కేటాయించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement