బైరెడ్డిపల్లె : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో శనివారం రాత్రి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ చందన ప్రియ కథనం మేరకు.. బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్న కరీంసాబ్ కుమారుడు సాధిక్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం వెళ్లాడు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.3.20 లక్షల నగదు, 35 గ్రాముల బంగారు, 100 గ్రాముల వరకు వెండి నగలు చోరీ చేశారు. బాధితుడు సాధిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే బీసీ కాలనీలో ఉన్న మణి ఇంట్లో రూ.50 వేల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇంట్లో లేనిప్పుడు పోలీసులకు లేదా సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వృద్ధురాలి నుంచి
గొలుసు అపహరణ
బంగారుపాళెం : మండల కేంద్రమైన బంగారుపాళెం ఎన్‌పీఎస్ కాలనీలో ఆదివారం దుండగుడు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. కాలనీలో నివాసముంటున్న చెంగయ్య భార్య వెంకటమ్మ(91) ఇంటి బయట కూర్చుని ఉంది. గుర్తుతెలియని వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకుని ఎఫ్‌జెడ్ మోటర్ సైకిల్‌పై వచ్చాడు. ఇక్కడ జగదీష్ ఇంటి అడ్రస్ చెప్పాలని వెంకటమ్మను అడిగాడు. ఇంతలోనే ఉన్నఫళంగా ఆమె మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఆమె తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. గొలుసు విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి కుమారుడు పార్థసారథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం
తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు.
31 వరకు పోలీస్ యాక్ట్
రేణిగుంట: రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమ ల్లో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివా రం రాత్రి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.


