పత్తాలేని పల్లె పాలన | - | Sakshi
Sakshi News home page

పత్తాలేని పల్లె పాలన

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

ఎక్కడి సమస్యలు అక్కడే

కనిపించని మౌలిక వసతులు

ఒక్కో అధికారికి 4–5 పంచాయతీలు

చెక్‌పవర్‌ లేక అధికారుల అవస్థలు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వలేదు. దీంతో పల్లె పాలన స్తంభించింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. చెక్‌ పవర్‌ లేకపోవడంతో నిధుల విడుదలకు అవకాశం లేకుండా పోతోందని ప్రత్యేక అధికారులు వాపోతున్నారు. దీనికితోడు ఒక్కో అధికారికి 4 నుంచి 5 పంచాయతీలను అప్పగించడంతో విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు.

– కార్వేటినగరం మండలం చింతతోపు ఎస్టీ కాలనీలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు మోటారు మరమ్మతులకు గురికావడంతోనే సమస్య నెలకొందని స్థానికులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బావులు, బోర్లు, చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

– తవణంపల్లె మండలంలో పారిశుద్ధ్యం లోపించింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతుండడంతో ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఆలయాల ముందు వ్యర్థపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలో 622 పంచాయతీలు ఉన్నాయి. వాటికి 145 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఒక అధికారికి 4 నుంచి 5 పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్‌, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఈవో, ఈవోపీఆర్డీ, వ్యవసాయ, హార్టికల్చర్‌, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించింది.

చెక్‌పవర్‌ లేక అవస్థలు

పల్లెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కనుసన్నల్లోనే ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. తాము చెప్పిన పనులనే చేయాలని, సూచించిన సమస్యలను మాత్రమే పరిష్కరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం వారికి పవర్‌ లేకుండా చేసింది. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అవుతున్నా నేటికి నిధులు డ్రా చేసేందుకు అధికారం ఇవ్వలేదు. సాంకేతికంగా వీరి ఆధార్‌, మొబైల్‌ నంబరు అప్‌డేషన్‌ ఉండడంతో వారికి ఇంకా డ్రాయింగ్‌ పవర్‌ రాలేదు. దీంతో పరిపాలన, అభివృద్ధి పనులు, ఇతర పాలనా పరమైన నిర్వహణను గాలికొదిలేశారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలి. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 4 నుంచి 5 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడడంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ప్రజల గగ్గోలు

ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, వి.కోట, పులిచెర్లలో తాగునీటి తీవ్రంగా సమస్య ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అవే కాకుండ పారిశుద్ధ్య లోపం, వీధి దీపాల నిర్వహణ, కనీసం బోర్‌ మోటార్‌ మరమ్మతులు తదితరాల గురించి పట్టించుకునే నాథుడే లేడు. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్‌ కార్యక్రమాలే సరిపోతున్నాయి.

క్వారేటినగరం ఎస్టీ కాలనీలో చేతిపంపు వద్ద నీటి కోసం తిప్పలు

తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యం

Advertisement
 
Advertisement
Advertisement