లోన్‌ యాప్స్‌! | - | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్స్‌!

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

● పలమనేరు మండలంలోని మాదగబండకు చెందిన మోహన్‌ అనే వ్యక్తి అధిక వడ్డీలు కట్టలేక ఇటీవల పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● తిరుపతికి చెందిన రాజు(30) లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● అలాగే తిరుపతికే చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బెంగళూరులో ఉంటూ అక్కడ లోన్‌ యాప్‌లో లక్షల్లో రుణం తీసుకున్నాడు. వడ్డీ ఎక్కువై కట్టలేక తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరులోని ఓ యువకునికి సైతం బెదిరింపులు తప్పలేదు. అతను అప్పుచేసి డబ్బు చెల్లించినా ఇంకా అప్పు ఉందని బెదిరించారు. దీంతో అతను కట్టకపోవడంతో వారి కుటుంబంలోని మహిళల ఫొటోలని మార్ఫింగ్‌ చేసి సెల్‌లో ఉన్న కాంటాక్టులోని నంబర్లకు పంపించారు. ఈ విషయం స్థానిక పోలీసుల వరకు వెళ్లింది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందల్లో జరిగినా వెలుగు చూస్తున్నవి కొన్ని మాత్రమే.

అప్పు తీసుకున్నాక బాకీ తీర్చడం చాలా కష్టం

సకాలంలో చెల్లించకుంటే కుటుంబ సభ్యుల నగ్న ఫొటోలతో బెదిరింపులు

ఇప్పటికే పలువురి ఫొటోల మార్ఫింగ్‌ మథనపడుతున్న బాధితులు

వేధిస్తున్న

ఇటీవల లోన్‌యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగదు అవసరమున్న వారిని గుర్తించి ఆధార్‌ కార్డును అప్‌లోడ్‌ చేస్తే చాలు లోన్లు ఇస్తున్నాయి. వాటిలో వారం, నెల, ఏడాది రుణాలున్నాయి. తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలంలో ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించని వారిని నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌కు పంపుతున్నారు. అదేవిధంగా మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఆధార్‌ కార్డు ఆధారంగా రూ.లక్షల్లో అధిక వడ్డీలకు రుణాలిస్తున్నాయి. అధిక వడ్డీలతో కంతులు కట్టలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు.

పలమనేరు: ఆర్థికంగా ఇబ్బందులున్న వారు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఓ లోన్‌కు సంబందించిన వివరాలను టచ్‌ చేస్తే చాలు ఆపై ఏఐ ఆధారంగా వారి మొబైల్‌కు రకరకాల లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలిస్తామనే మెసేజ్‌లు, లింకులు వస్తూనే ఉంటాయి. వీటిని చూసి కాస్త టెంప్ట్‌ అయి రుణం తీసుకుంటే మన తల వారి చేతికి ఇచ్చినట్టే. అధిక వడ్డీలు వేసి ఇబ్బందులు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్‌ ఫొటోలను వాట్సాప్‌కు పంపుతున్నారు. అంతేగాక వారి బంధువులు, స్నేహితుల మొబైళ్లకు సైతం పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో పేదలు వారు అడిగినంత డబ్బు చెల్లించలేక నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న

కొన్ని ఘటనలు

వీరు ఎలా రుణాలిస్తారంటే..

రకరకాల లోన్‌ యాప్స్‌ ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్షల వరకు రుణం పొందవచ్చు. నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్న వారి ఆధార్‌, కుటుంబ సభ్యుల ఆధార్‌, వారి ఫోన్‌ నంబర్లు తీసుకుంటారు. ఆపై ప్రొసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ తదితరాలు పట్టుకుని మన ఖాతాలోకి నగదు జమచేస్తారు. రూ.5 వడ్డీతో అసలు కలిపి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టాల్సి ఉంటుంది. అప్పు తీసుకునే వారి స్థోమత, సిబిల్‌ రేటింగ్స్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు.

ఎంతకట్టినా అప్పు తీరదు

అధికవడ్డీతో ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించాల్సి రావడం, ఓ కంతు కట్టకుంటే దానికి జరిమానా కలిపి భారీగా పెరగడం తదితరాలతో అప్పు తీరడం కష్టంగా మారుతుంది. మొదట్లో ఇదంతా చాలా సులభంగా ఉంటుందని నిర్వాహకులు నమ్మించి ఆపై అసలు కథను నడిపిస్తున్నారు. తీసుకున్న లోన్‌కు అసలు, వడ్డీ కలిపి కట్టినా ఇంకా ఉందంటూ బెదిరింపులు తప్పడం లేదు. కట్టకుంటే మీ కుటుంబ సభ్యుల న్యూడ్‌ పొటోలను వైరల్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

బ్లాక్‌మెయిల్‌ చేసి మరీ వసూళ్లు

కంతులు సకాలంలో కట్టకుంటే డబ్బు తీసుకున్న వారి వాట్సాప్‌, కుటుంబ సభ్యుల వాట్సాప్‌కు వారి ఆధార్‌ ఆధారంగా ఉన్న ఫొటోలను మార్పింగ్‌ చేసి నగ్న ఫొటోలను సెండ్‌ చేస్తున్నారు. అప్పటికీ నగదు కట్టకుండా ఉంటే వారి వాట్సాప్‌ను హ్యాక్‌ చేసి అందులో ఉన్న నంబర్లకు సైతం న్యూడ్‌ ఫొటోలను పంపుతున్నా రు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురికి ఈ విధమైన పరిస్థితి ఎదురైంది. వారు అప్పు చేసి మరీ మొత్తం అప్పు కట్టేశారు. ఈ మొత్తం వ్యవహారం యాప్‌ ద్వారానే సాగుతున్నందున ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కుమిలిపోతున్నారు. ఇలాంటి లోన్‌యాప్‌ల జోలికి వెళ్లరాదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నా జనం మాత్రం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు.

అధిక వడ్డీలతో జనాన్ని లూటీ చేస్తున్న వైనం

Advertisement
 
Advertisement
Advertisement