ఫ్రీ డయాలసిస్‌ సెంటర్‌ రానట్టే! | - | Sakshi
Sakshi News home page

ఫ్రీ డయాలసిస్‌ సెంటర్‌ రానట్టే!

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

● ఏపీలో కొత్త సెంటర్ల జాబితాలో కనిపించని పలమనేరు పేరు ● నెరవేరని స్థానికుల కల ● డయాలసిస్‌ కోసం రోగులు వేరేచోటికి వెళ్లాల్సిందే

పలమనేరు: పలమనేరులోని కిడ్నీవ్యాధిగ్రస్తులు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని అనేక ఏళ్లుగా కోరుతున్నారు. అధికారులు ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి పంపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉచిత డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని 12 పట్టణాల్లో పీఎంఎన్‌డీపీ (ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం) కింద కొత్తగా ఉచిత డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరుకు మాత్రం మంజూరైనట్టు తెలిపారు. దీనికి రూ.85 లక్షలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ సెంటర్లు ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా నడుస్తాయని వెల్లడించారు. పలమనేరు పేరు లేకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. ఫలితంగా డయాలసిస్‌ రోగులు బంగారుపాళెం లేదా అన్నమయ్య జిల్లా మదనపల్లె, తిరుపతి, కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిందే

పలమనేరు నియోజకవర్గంలో కిడ్నీ డయాలసిస్‌ రోగులు 256 మంది వరకు ఉన్నారు. వీరిలో డబ్బులున్న వారు తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రలు, వేలూరు సీఎంసీ, కుప్పం పీఈఎస్‌, బెంగళూరులోని ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. పేదలు మాత్రం ఇక్కడికి 24 కిలోమీటర్ల దూరంలోని బంగారుపాళెం వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఏడు డయాలసిస్‌ యంత్రాలు ఉన్నాయి. వందల సంఖ్యలో రోగులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో అప్పోసప్పో చేసి ప్రైవేటు సెంటర్లకు వెళ్లాల్సివస్తోంది. ఇప్పటికై నా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి పలమనేరుకు డయాలసిస్‌ సెంటర్‌ వచ్చేలా చొరవచూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement