జనసేన గుడిపాల అధ్యక్షుడిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

జనసేన గుడిపాల అధ్యక్షుడిపై కేసు నమోదు

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : గుడిపాల మండలం నుంచి తమిళనాడుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు తేలడంతో జనసేన మండల అధ్యక్షుడు రూప్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ శ్రీనివాసులు ఇసుక అక్రమాలపై నిఘా పెట్టారు. నారగల్లు పంచాయతీ సమీపంలో ఉన్న మంచినీళ్లగుంట వద్ద ఇసుక డంపింగ్‌ను గుర్తించారు. వీఆర్వో రాజారాం ద్వారా విచారణ చేయించారు. ఈ క్రమంలో గుడిపాల మండలానికి చెందిన జనసేన అధ్యక్షుడు రూప్‌కుమార్‌ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్‌ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తేలింది. దీంతో తహసీల్దార్‌ ఇసుకను సీజ్‌ చేసి గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement